వడ్ల రాజకీయాలలో చివరికి ఎవరు గెలిచారు?

April 13, 2022


img

ధాన్యం కొనుగోలు పేరిట తెలంగాణలో జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు నిన్న అనూహ్యమైన మలుపు తిరిగింది. రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కేంద్రప్రభుత్వమే కొనాలని లేకుంటే ఉద్యమస్థాయిలో ఆందోళనలు చేసి కేంద్రం మెడలు వంచుతామని ప్రకటించిన సిఎం కేసీఆర్‌, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగి రాగానే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించి ప్రతిపక్షాలకు ముఖ్యంగా బిజెపికి షాక్ ఇచ్చారు. అంతేకాదు... క్వింటా రూ.1960 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తామని మద్దతు ధర కూడా ప్రకటించారు.

ఒకవేళ టిఆర్ఎస్‌ కూడా ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్రంలో ఉద్యమాలు సాగించి ఉండి ఉంటే ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం ఉండేది. కానీ ఎవరూ ఊహించని విదంగా మొత్తం ధాన్యం తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో ప్రతిపక్షాలకు ఆ అవకాశం లేకుండా చేశారు. అంతేకాదు... కేంద్రప్రభుత్వం మొండిచేయి చూపినా రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులను ఆదుకొంటోందని ప్రజలకు గట్టి నమ్మకం కలిగించారు.

కనుక కాంగ్రెస్‌, బిజెపిలు ఇక చేసేదేమీ లేక తమ ఒత్తిళ్ళ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని సర్దిచెప్పుకోవలసివస్తోంది. అయితే వాటి వాదనల కంటే సిఎం కేసీఆర్‌ తీసుకొన్న ఈ నిర్ణయమే ప్రజలపై, ముఖ్యంగా వరి రైతులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వేరే చెప్పక్కరలేదు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని, రాష్ట్ర బిజెపి నేతల మాటలను నమ్మోకోవడం కంటే కష్టమొచ్చినప్పుడు వెంటనే ఆదుకొనే సిఎం కేసీఆర్‌ వెంట నడవడమే మంచిదని ప్రజలు, రైతులు భావించడం సహజం.

అయితే ఈ వడ్ల రాజకీయాలను ఉవ్వెత్తున ఎగిసేలా చేసి, దానిని ఢిల్లీ వరకు కూడా తీసుకువెళ్ళిన సిఎం కేసీఆర్, రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తారనుకొంటే, అనూహ్యంగా ఇటువంటి ముగింపు ఇవ్వడం ఓ ఎత్తుగడే అని స్పష్టం అయ్యింది. కానీ దీనిని అర్ధం చేసుకోలేక కాంగ్రెస్‌, బిజెపిలు ఎగిరెగిరిపడి చివరికి బోర్లా పడ్డాయి. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్‌, బిజెపిలు ఎంత గొంతు చించుకొన్నా ప్రజలు, రైతులు వాటిని పట్టించుకోరని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈ వడ్ల రాజకీయ యుద్ధంలో కాంగ్రెస్‌, బిజెపిలపై సిఎం కేసీఆర్‌ పైచేయి సాధించారని స్పష్టమవుతోంది.


Related Post