మన తెలంగాణ బిడ్డ రజని...ఏపీ మంత్రి

April 13, 2022


img

ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో మన తెలంగాణ బిడ్డ విడదల రజనికి మంత్రి పదవి లభించడం విశేషం. అదికూడా చాలా కీలకమైన రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ లభించడం ఆమె ప్రతిభకు, సమర్ధతకు నిదర్శనంగా భావించవచ్చు. 

విడదల రజని తండ్రి పేరు రాగుల సత్తయ్య. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే తుర్కపల్లి మండలంలోని కొండాపురం గ్రామానికి చెందినవారు. సుమారు 40 ఏళ్ళ క్రితం ఆయన సికింద్రాబాద్‌ వచ్చి సఫిల్‌గూడాలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. ఆయన రెండో కుమార్తె విడదల రజని. 

 రజని మల్కాజిగిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ చేసి, తరువాత ఎంబీఏ చేశారు. కొంతకాలం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెకు గుంటూరు జిల్లాకు చెందిన విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. అనంతరం వారిరువురూ అమెరికా వెళ్ళి శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించారు. విడదల రజని దానికి కొంతకాలం బోర్డు మెంబరు, డైరెక్టర్‌గా పనిచేశారు. 

విడదల రజని 2014లో అమెరికా నుంచి తిరిగివచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె 2019 శాసనసభ ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి టికెట్ ఆశించారు కానీ లభించకపోవడంతో ఆమె వైసీపిలో చేరి తన రాజకీయ గురువు టిడిపి నేత పత్తిపాటి పుల్లారావుపైనే పోటీ చేసి ఓడించి గురువును మించిన శిష్యురాలు అనిపించుకొన్నారు. 

తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన విడదల రజని ఇప్పుడు 31 ఏళ్ళ వయసులోనే మంత్రి పదవి చేపట్టారు. మరో విశేషం ఏమిటంటంటే గతంలో టిడిపి హయాంలో ఆమె గురువుగారు పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవినే విడదల రజని చేపట్టారు.  

తమ గ్రామానికి చెందిన విడదల రజని ఏపీలో మంత్రి పదవి చేపట్టడంతో కొండాపురం గ్రామ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Related Post