గవర్నర్‌తో టిఆర్ఎస్‌ సర్కార్ గ్యాప్ కొనసాగించబోతోందా?

April 12, 2022


img

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి రైల్లో కొత్తగూడెం చేరుకొన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్‌, జిల్లా డీఎస్పీ స్వాగతం పలకాల్సి ఉంది. కానీ వారికి బదులు అదనపు కలెక్టర్‌ కే.వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ ప్రసాద్ గవర్నర్‌కి స్వాగతం పలికారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, మణుగూరు ఏఎస్పీ శబరీష్, ట్రైనీ ఏఎస్పీ క్రాంతి గవర్నర్‌ బందోబస్తులో పాల్గొన్నారు. మొన్న (ఆదివారం) భద్రాచలంలో మంత్రుల వెంటే ఉన్న వారిరువురూ నిన్న గవర్నర్‌ వచ్చినప్పుడు రాలేదు!

ఆలయం వద్ద ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ఈవో శివాజీ స్వాగతం పలకగా ఆలయ అర్చకులు ఆనవాయితీ ప్రకారం గవర్నర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్‌ దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించుకొని శ్రీరామపట్టాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని ప్రోటోకాల్ గురించి ప్రశ్నించగా ఆమె సున్నితంగా తిరస్కరించి తన తదుపరి కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. 

గవర్నర్‌ పట్ల తమ ప్రభుత్వం ఎన్నడూ అమర్యాదగా వ్యవహరించలేదని, ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని టిఆర్ఎస్‌ మంత్రులు గట్టిగా వాదిస్తున్నారు. కానీ గవర్నర్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ రాకపోవడం గమనిస్తే, ప్రభుత్వం గవర్నర్‌తో గ్యాప్ మేన్‌టైన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ ప్రోటోకాల్ వివాదం తలెత్తకుండా వారికి బదులు అదనపు కలెక్టర్‌, అదనపు ఎస్పీలతో స్వాగతం పలికించినట్లు భావించాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం గవర్నర్‌ను దూరం పెడితే ప్రభుత్వానికే నష్టం తప్ప ఆమెకు ఎటువంటి నష్టమూ ఉండదు. గవర్నర్‌ ఆమోదం పొందాల్సిన ఫైల్స్ చాలానే ఉంటాయి. అప్పుడు ఆమె వాటిని పక్కనపెడితే ఇబ్బంది పడేది ప్రభుత్వమే. గవర్నర్‌ రాజ్‌భవన్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకు ఇటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటి వలన కూడా ఆమెకు ప్రజలలో సానుభూతి పెరుగుతుందే తప్ప తరగదు. పైగా ఆమెను ప్రభుత్వం సముచితంగా గౌరవించకపోతే ప్రజల దృష్టిలో ప్రభుత్వం పలచన అవుతుంది. కనుక గ్యాప్ తగ్గించుకోవడం మంచిదేమో? కానీ టిఆర్ఎస్‌ మంత్రులు మాటలు వింటే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్దంగా లేదని అర్ధమవుతోంది.


Related Post