జీయర్ స్వామి వెనక్కి...స్వరూప స్వామి ముందుకి?

April 12, 2022


img

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్నంత కాలం చిన్న జీయర్ స్వామికి శిష్యుడిలా మెలిగిన సిఎం కేసీఆర్‌ ఆలయ నిర్మాణం పూర్తవగానే ఆయనను దూరం పెట్టారు. వారి మద్య గ్యాప్‌కి కారణం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలోకి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని తీసుకువస్తున్నారా?అంటే అవునని చెప్పడం తొందరపాటే అవుతుంది కానీ జీయర్ స్వామి కంటే ముందుగా ఆయన యాదాద్రి పర్యటనకు వస్తుండటం అటువంటి అనుమానం కలుగజేస్తోంది. 

స్వరూపానందేంద్ర స్వామి ఈరోజు ఉదయం విశాఖ నుంచి విమానంలో ఉదయం 9 గంటలకు శంషాబాద్ చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి 10.45 గంటలకు యాదాద్రి చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తారు. తరువాత కొత్తగా నిర్మించిన ఆలయాన్ని చూస్తారు. ఉదయం 11.50 గంటలకు యాదమహర్షి ఆలయాన్ని దర్శించుకొన్న తరువాత మీడియాతో మాట్లాడుతారు. మళ్ళీ రోడ్డు మార్గాన్న హైదరాబాద్‌ తిరిగివెళతారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించడంతో ఆయన యాదాద్రికి వస్తున్నట్లు సమాచారం. 

యాదాద్రికి కూతవేటు దూరంలోనే ముచ్చింతల్‌లో ఉంటున్న చిన్న జీయర్ స్వామి ఇంతవరకు ఆలయాన్ని దర్శించుకోలేదు. ఆయనను ప్రభుత్వం ఆహ్వానించలేదని యాదాద్రికి వెళ్లలేదో లేక అక్కడ అవమానాలు ఎదురవుతాయని వెళ్లలేదో తెలీదు కానీ ఇంతవరకు వెళ్లలేదు. ఇక ముందు వెళతారో లేదో కూడా తెలీదు. 

ఒకవేళ ప్రభుత్వం ఇంతవరకు ఆయనను యాదాద్రికి ఆహ్వానించకపోయుంటే అది సరికాదనే చెప్పాలి. అలాగే అందరికీ మార్గదర్శనం చేస్తున్న చిన్న జీయర్ స్వామి ఇటువంటి రాగద్వేషాలకు, మానావమానాలకు అతీతంగా ఉంటారని ప్రజలు ఆశిస్తుంటారు కనుక ప్రభుత్వంపై అలిగి దైవదర్శనం చేసుకోకపోవడం సమంజసంగా లేదు. అలాగే విశాఖ నుంచి వస్తున్న స్వరూపానందేంద్ర కొండపై రాజకీయాలు మాట్లాడకుండా యాదాద్రి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళితే హుందాగా ఉంటుంది. 


Related Post