రేపు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్..ఏం జరుగుతుందో?

April 11, 2022


img

తొలిసారిగా సిఎం కేసీఆర్‌ పది రోజులు ఢిల్లీలోనే మకాం వేయడం, కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీలో దీక్ష చేయడం విశేషం.    ధాన్యం కొనుగోలుపై 24 గంటలలోపుగా కేంద్రప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించాలని డెడ్‌లైన్‌ విధించి మరీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ తిరిగివస్తున్నారు. అయితే ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం తన వైఖరి ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది కనుక కొత్తగా చెప్పేదేమీ ఉండదని అందరికీ తెలుసు. 

ఈ నేపధ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతుండటం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో సిఎం కేసీఆర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని సిఎం కేసీఆర్‌ ముందే చెప్పారు. కనుక రేపు మంత్రివర్గ సమావేశంలో ఆందోళనలు ఏవిదంగా చేయాలని నిర్ణయిస్తారా? లేదా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అటు కేంద్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, ఇటు రాష్ట్రంలో బిజెపిని దెబ్బతీసేందుకు తమ లోక్‌సభ ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళతారా?లేక మరేదైనా అనూహ్యమైన ఎత్తుగడ వేస్తారా? అనేది రేపు మంత్రివర్గ సమావేశం తరువాత తెలుస్తుంది. 


Related Post