అక్కడ ఢిల్లీలో టిఆర్ఎస్‌ దీక్ష...ఇక్కడ ఇందిరా పార్క్‌లో బిజెపి దీక్ష

April 11, 2022


img

ధాన్యం కొనుగోలు పేరుతో టిఆర్ఎస్‌, బిజెపిలు పరస్పరం ఆరోపించుకొంటూ రైతులకు మద్దతుగా పోటాపోటీలుగా దీక్షలు చేస్తుండటం విశేషం. నేడు ఢిల్లీలో సిఎం కేసీఆర్‌ అధ్వర్యంలో టిఆర్ఎస్‌ నిరసన దీక్ష చేయగా, ఇక్కడ హైదరాబాద్‌లో ఇందిరా పార్క్‌ వద్ద రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో రాష్ట్ర బిజెపి నేతలు కూడా వరి రైతులకు మద్దతుగా ధర్నా చేయడం విశేషం. 

ఇదివరకు సిఎం కేసీఆర్‌ కూడా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇక్కడే దీక్ష చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర బిజెపి నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇందిరా పార్క్‌ వద్దనే దీక్ష చేస్తుండటం విశేషం. 

ఛత్తీస్‌ఘడ్‌ వంటి పేదరాష్ట్రం ఈ వేసవిలో రైతులు పండించిన దుడ్డుబియ్యం మిల్లు పట్టించడానికి రాయితీ ఇచ్చి సన్నబియ్యంగా చేసి కేంద్రానికి సరఫరా చేస్తుంటే, తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకొనే సిఎం కేసీఆర్‌ ఎందుకు ఆ పని చేయడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ఆవిదంగా చేస్తే తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని, కానీ సిఎం కేసీఆర్‌ తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తూ రాష్ట్రంలో రైతులను మోసాగిస్తున్నారని ఆరోపించారు. సిఎం కేసీఆర్‌కు నిజంగా రైతులపై ప్రేమ ఉన్నట్లయితే ముందు ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేస్తున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

అక్కడ ఢిల్లీలో సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కేంద్రప్రభుత్వమే కొనుగోలుచేయాలని లేకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 

ఈవిదంగా టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ కూడా రైతుల పక్షమే నిలబడి ధాన్యం కొనుగోలు చేయాలంటూ పరస్పరం పోరాడుకొంటుంటే ఎవరి మాట నమ్మాలో తెలియక రాష్ట్రంలో రైతులు అయోమయంలో ఉన్నారు. 


Related Post