ఆర్‌కె రోజా అనే నేను...

April 11, 2022


img

ప్రముఖ తెలుగు సినీ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మంత్రి పదవి చేపట్టాలనే ఎన్నో ఏళ్ళ కల నేడు నెరుతోంది. రోజా ఓ వైపు సినిమాలు చేస్తూనే 1999 నుంచి 2009 వరకు తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ టిడిపిలో సముచితస్థానం లభించకపోవడం, అవమానాలు ఎదుర్కోవలసి వస్తుండటంతో ఆమె 2009 ఆగస్టులో టిడిపిని వీడి వైసీపీలో చేరారు. 

రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆమె నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు కానీ ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించలేకపోయింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార టిడిపిని తనదైన శైలిలో చీల్చి చెండాడుతుండేవారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో మళ్ళీ నగరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికలలో వైసీపీ గెలిచి ఏపీలో అధికారంలోకి రావడంతో, పార్టీలో చాలా చురుకుగా వ్యవహరించే రోజాకు తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని ఆమెతో సహా అందరూ భావించారు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించారు. దాంతో రోజా తీవ్ర అసంతృప్తి చెందినప్పటికీ సిఎం జగన్ పట్ల విధేయంగా ఉంటూ, పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తుండటంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఆమెను మంత్రిగా క్యాబినెట్‌లోకి తీసుకొన్నారు. 

దీంతో మంత్రి పదవి చేపట్టాలనే రోజా కల నేటికి నెరవేరింది. ఇక ఆమెకు ఏ మంత్రిత్వశాఖ కేటాయిస్తారనేది మరి కొద్ది సేపటిలో తెలుస్తుంది. మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నందున ఇక నుంచి సినిమాలు, జబర్దస్త్ ప్రోగ్రాంలలో పాల్గొనబోనని రోజా ప్రకటించారు.


Related Post