తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పాలైన కారణంగా ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యత అన్ని పార్టీలని చాలా ఊరిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదో ఒక రాజకీయ లబ్ది పొందాలని అన్ని పార్టీలు ఉవిళ్ళూరుతున్నాయి. ముఖ్యంగా కాటికి కాళ్ళు జాపుకొని కూర్చొన్న ప్రధాన ప్రతిపక్ష నేత కరుణానిధి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.
అందుకోసం ఆయన చాలా తెలివిగా అధికార అన్నాడిఎంకె పార్టీలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంగా ఉన్న కారణంగా కావేరీ నదీ జలాల పంపిణీతో సహా రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకొనిపోతున్నాయని కానీ అధికార పార్టీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా కాలక్షేపం చేసేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కోలుకొనేవరకు, అధికార పార్టీ తాత్కాలికంగా ఎవరికైనా ఆ బాధ్యతలు అప్పగింఛి సమస్యలని పరిష్కరించాలని ప్రజలు, తమ పార్టీ కూడా కోరుకొంటున్నామని కరుణానిధి అన్నారు.
కనుక తక్షణమే మంత్రివర్గ సమావేశమో లేదా అత్యవసర శాసనసభ సమావేశాలో లేదా అఖిలపక్ష సమావేశమో ఏర్పటు చేయాలని కరుణానిధి డిమాండ్ చేశారు. ఒకవేళ అధికార పార్టీ దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోయినట్లయితే, గవర్నర్ విద్యాసాగర్ రావు తక్షణమే చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు.
నిజానికి అన్నాడిఎంకె పార్టీలో కొందరు నేతలు కూడా ఉపముఖ్యమంత్రి లేదా ఆపధర్మ ముఖ్యమంత్రిని నియమించి తాత్కాలికంగా ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అతనికి అప్పగించాలని ఆలోచిస్తున్నారు. కానీ పార్టీలో మరికొందరు సీనియర్లు వారికి అడ్డుపడుతున్నందున ధైర్యం చేయలేకపోతున్నారు.
అధికార పార్టీలో నెలకొన్న ఈ అయోమయ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్న కరుణానిధి, ప్రభుత్వా పగ్గాలు చేజిక్కించుకోవాలని ఆశ పడుతున్నవారిని మరికాస్త ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆయన ప్రయత్నాలు ఫలించి, అన్నాడిఎంకె లో ఎవరైనా కాస్త ధైర్యం చేసి ముందుకు వచ్చినట్లయితే, డిఎంకె పార్టీ అతనికి తప్పకుండా మద్దతు ఇస్తుందని చెప్పవచ్చు.
తద్వారా అధికార అన్నాడిఎంకె పార్టీలో నిలువునా చీలిపోవడమే కాకుండా, డిఎంకె పార్టీ చేతిలోకి ప్రభుత్వం పగ్గాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక జయలలిత కోలుకోనేలోగానే కరుణానిధి తన పని చక్కబెట్టుకొనే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.