అవును ఇమ్రాన్ ఖాన్ చెప్పింది నిజమే కదా?

April 09, 2022


img

పాక్‌ ప్రధానిగా ఎవరున్నప్పటికీ వారు భారత్‌ను నిత్యం విమర్శిస్తూనే ఉంటారనేది అందరికీ తెలుసు. కానీ ప్రధాని పదవి కోల్పోయి, పాక్‌ సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొని నేడు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొబోతున్న ఇమ్రాన్ ఖాన్ నోట భారత్‌ గొప్పదనం గురించి వినబడటం విశేషం.

ఈరోజు పాక్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో ఆయన ప్రసంగిస్తూ, “మన పొరుగునే ఉన్న భారత్‌ సార్వభౌమదేశం. దానిని ప్రపంచంలో ఏ శక్తి శాశించలేదు. భారతీయులు చాలా ఆత్మాభిమానం కలవారు,” అంటూ ప్రశంశించారు.

ఇంతకాలం పాక్‌ పాలకులు తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టకుండా, భారత్‌ను అస్థిరపరచేందుకు పాములకు పాలు పోసి పెంచినట్లుగా ఉగ్రవాదులకు సాకారు. పాక్‌ పాలకులకు దూరదృష్టి లోపించడంతో ఆ దేశం ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. అదే సమయంలో భారత్‌ పాక్‌ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ అగ్రదేశాల సరసన నిలిచే స్థాయికి ఎదిగింది. ఈ విషయం పాక్‌ పాలకులకు, ప్రతిపక్షాలకు కూడా బాగా తెలుసు. కానీ బహిరంగంగా చెపితే రాజకీయంగా ఇబ్బందులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది.

పాక్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించిన తీరే ఇందుకు తాజా ఉదాహరణ. “అధికారం కోల్పోవడంతో ఇమ్రాన్ ఖాన్ మతి స్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయనకు భారత్‌ అంటే అంత గౌరవం, అభిమానం ఉన్నట్లయితే ఆయన తక్షణం పాక్‌ విడిచి భారత్‌ వెళ్ళిపోవాలి,” అని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాక్‌లో  నిరసనలు మొదలైనప్పటి నుంచే ఆయన భారత్‌ను పొగడటం ప్రారంభించారు.  తనను గద్దె దించడానికి ప్రతిపక్షాల సాయంతో అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. బహుశః అందుకే భారత్‌  చాలా శక్తివంతమైన దేశమని దానిని ప్రపంచంలో ఏ శక్తీ (అమెరికా) శాసించలేదని ఇమ్రాన్ ఖాన్ చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది. ఇది నిజం కూడా.


Related Post