కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్‌ ఎవరు?

April 09, 2022


img

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి మొన్న మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు నన్ను ఆహ్వానించకుండా సిఎం కేసీఆర్‌ నన్ను అవమానించారు. బడ్జెట్‌ సమావేశాలకు మరో 15 రోజులు అనుమతీయకుండా నేను ఆపితే కేసీఆర్‌ ప్రభుత్వం పడిపోయేది. కానీ నేను ఎన్నడూ అటువంటి ఆలోచనలు చేయను,” అని అన్నారు.

ఆమె వ్యాఖ్యలపై టిఆర్ఎస్‌ కంటే ముందు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఘాటుగా స్పందించడం విశేషం. “ప్రజల చేత ఎన్నుకోబడిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి గవర్నర్‌ ఎవరు? తమను ఎవరు పరిపాలించాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకొంటారు తప్ప కేంద్రప్రభుత్వం కాదు,” అని ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. 

ఇన్నిరోజులుగా గవర్నర్‌ చాలా సమయమనంతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనను పదేపదే అవమానిస్తోందని చెపుతూ వచ్చారు. దాంతో ఆమె పట్ల ప్రజలలో సానుభూతి పెరిగింది. ప్రభుత్వం తప్పు చేస్తోందనే భావన ప్రజలలో కూడా ఏర్పడింది. 

కానీ ఆమె ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసి వచ్చిన తరువాత ‘నేను తలుచుకొంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి ఉండేదంటూ...’ మాట్లాడటంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ఆమెకు మనసులో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలున్నాయని బయటపెట్టుకొన్నట్లయింది. “ఆమె ఓ గవర్నర్‌లాగ కాకుండా బిజెపి నాయకురాలిగా వ్యవహరిస్తోందని...” టిఆర్ఎస్‌ ఆరోపణలకు ఆమె స్వయంగా దృవీకరించినట్లయింది. 

కనుక ఇప్పుడు ఆమె ఏమి మాట్లాడినా, ఏం చేసినా అది కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే అని ప్రజలు అనుమానించే పరిస్థితి ఆమె స్వయంగా కల్పించుకొన్నట్లయింది. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటివారు కూడా స్పందిస్తున్నారని చెప్పవచ్చు. 



Related Post