టిఆర్ఎస్‌ ధర్నాలతో హోరెత్తిన తెలంగాణ రాష్ట్రం

April 08, 2022


img

తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యం అంతటినీ కేంద్రప్రభుత్వమే కొనుగోలుచేయాలని డిమాండ్ చేస్తూ, టిఆర్ఎస్‌ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. వీటిలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి హరీష్‌రావు అధ్వర్యంలో సిద్ధిపేటలో ధర్నా నిర్వహించగా, మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్లా జిల్లాలో, మిగిలినవారు తమ తమ జిల్లా కేంద్రాలలో జరిగిన ధర్నాలలో పాల్గొని ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం తీరును ఎండగట్టారు. తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్‌ శ్రేణులు, రైతుల ఇళ్ళపై నల్లజండాలు ఎగురవేసి నిరసన తెలియజేయనున్నారు.

ఓ పక్క టిఆర్ఎస్‌ ధర్నాలతో రాష్ట్రం హోరెత్తిపోతుండగా, మరోపక్క కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలతో రాష్ట్రం హోరెత్తిపోయింది. గురువారం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్‌ నేతల అధ్వర్యంలో హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ వద్ద ధర్నా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో చాలాసేపు ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. పోలీసులు కాంగ్రెస్‌ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బందం చేసినప్పటికీ కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాలతో హోరెత్తించాయి. 

ధాన్యం కొనుగోలు చాలా తీవ్రమైన సమస్యే కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే రోడ్లపై బైటాయించి రాస్తారోకోలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించడాన్ని ఎవరూ హర్షించరు. కేంద్రప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనలేకపోవడానికి తగిన కారణం చెపుతున్నప్పుడు, ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి కానీ ధర్నాలు, రాస్తారోకోలు చేసి కేంద్రప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపించాలనుకోవడం సరికాదు.


Related Post