రాజకీయ కారణాలతో ప్రోటోకాల్ పాటించకపోతే?

April 07, 2022


img

టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి గవర్నర్‌కి మద్య మొదలైన కోల్డ్ వార్ పూర్తిస్థాయి యుద్ధంగా మారబోతోందని తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి జగదీష్ రెడ్డిల తాజా విమర్శలు, ఆరోపణలతో స్పష్టం అవుతోంది. సిఎం కేసీఆర్‌ పెద్దలని, రాజ్యాంగ వ్యవస్థలని ఎల్లప్పుడు గౌరవిస్తారని, ప్రోటోకాల్‌ ప్రకారమే నడుచుకొంటారని, కానీ గవర్నర్‌ తమిళిసై బిజెపి నాయకురాలిగా వ్యవహరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. 

కానీ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కొరకు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సిఎం కేసీఆర్‌ విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలుకలేదు. ఆయనతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. అప్పుడు స్వల్ప జ్వరం వచ్చినందున వెళ్లలేకపోయారని చెప్పారు. 

ఆ తరువాత గవర్నర్‌ తమిళిసై మేడారం జాతరకు వెళ్లినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, కనీసం జిల్లా అధికారులు ఆమెను ఆహ్వానించడానికి వెళ్లలేదు. అది ప్రోటోకాల్ ఉల్లంఘించడమే కాకుండా గవర్నర్‌ను అవమానించినట్లే అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. 

ఆ తరువాత రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిఎం కేసీఆర్‌తో సహా ఎవరూ హాజరుకాలేదు. అది తన సొంత కార్యక్రమం కాదని, త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశ గౌరవాన్ని, జాతీయ స్ఫూర్తిని చాటుకొనే ఒక రాజ్యాంగబద్దమైన కార్యక్రమమని, దానికి సిఎం కేసీఆర్‌, మంత్రులు హాజరుకాకపోవడం సరికాదని గవర్నర్‌ తమిళిసై సున్నితంగా చెప్పారు.   

 ఆ తరువాత జరిగిన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ఆనవాయితీ ప్రకారం ఆమెను ఆహ్వానించలేదు. యాదాద్రి ఉద్ఘాటనకు ఆమెను ఆహ్వానించలేదు. అయినప్పటికీ ఆమె ఉగాది వేడుకలకు సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినా ఎవరూ వెళ్ళలేదు. 

గవర్నర్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో ప్రోటోకాల్ పాటించకపోవడానికి టిఆర్ఎస్‌ రకరకాల కారణాలు చెపుతోంది కానీ వాస్తవం ఏమిటో అందరికీ తెలుసు. 

‘త్రిదండి చిన్న జీయర్ స్వామి నాకు గురువు..ఆయన మార్గదర్శనంలోనే యాదాద్రిని ఇంత మహాద్భుతంగా తీర్చిదిద్దుతున్నానని...’ చెప్పిన సిఎం కేసీఆర్‌ యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించలేకపోవడాన్ని ఏమనుకోవాలి?

ఈవిదంగా రాజకీయ కారణాలతో ఒక్కొక్కరితో గ్యాప్ పెంచుకొంటూ, మళ్ళీ దానిని సమర్ధించుకొంటే చివరికి నష్టపోయేది ఎవరని ఆలోచిస్తే మంచిది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రోటోకాల్ పాటించకపోతే ఏదో ఓ రోజున వారే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది తప్ప ప్రభుత్వం కాదని వారికీ తెలుసు. కనుక రాజకీయాలను, ప్రోటోకాల్ విధి విధానాలతో ముడిపెట్టకుండా పాటించడమే అందరికీ శ్రేయస్కరం లేకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు పక్కనే ఏపీ రాష్ట్రంలో పరిణామాలు కళ్లెదుటే ఉన్నాయి. 


Related Post