గవర్నర్‌తో ఇక యుద్ధమే: మంత్రి జగదీష్ రెడ్డి సంకేతం

April 07, 2022


img

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి మద్య ఏర్పడిన దూరం మరింత పెరగబోతోందని మంత్రి జగదీష్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు, విమర్శలు సూచిస్తున్నాయి. ఆయన నిన్న సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ పెద్దవాళ్ళను గౌరవించడంలో, ప్రోటోకాల్ పాటించడంలో ఎప్పుడూ ముందుంటారు. కనుక గవర్నర్‌ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సరికాదు. గవర్నర్‌ రాజ్యాంగబద్దంగా తన పరిధిలో వ్యవహరిస్తే మేమూ ఆమెను గౌరవిస్తాము కానీ ఆమె ఓ బిజెపి నాయకురాలిగా వ్యవహరిస్తునందునే ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. ఆమె ఓ గవర్నర్‌గా రాష్ట్రంలో ఎక్కడకి పర్యటించినా ప్రోటోకాల్ పాటిస్తాము కానీ ఓ బిజెపి నేతగా పర్యటిస్తే ప్రభుత్వం పట్టించుకోనవసరం లేదు.

అయినా ఓ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలుగా చేసిన ఆమెను గవర్నర్‌గా నియమించడంలో అర్ధం ఏమిటి? అటువంటి రాజకీయ నేపధ్యం కలిగిన ఆమె రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తాని ఏవిదంగా భావించగలము? ఓ ఎమ్మెల్సీ అభ్యర్ధి అర్హతను నిర్ణయించడం ఏమిటి?రాజకీయాలు కూడా సేవా రంగమే. కనుక ఆ నేపధ్యం కలిగిన పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలని ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు దానిని విధిగా ఆమోదించడం గవర్నర్‌ బాధ్యత. కానీ ఆమె అందుకు భిన్నంగా వ్యవహరించడం రాజకీయ ఫ్రేరేపితమే అని భావిస్తున్నాము. 

బిజెపి గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని చూస్తే మేము సహించబోము. దేశంలో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్య ఇటువంటి వివాదాలు ఏర్పడటం కొత్త కాదు. గవర్నర్‌ తన పరిధిలో ఉన్నంతకాలం ఎటువంటి సమస్యలు రావు. కానీ దాటితేనే ఇటువంటి వివాదాలు మొదలవుతుంటాయి. గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనకు ప్రభుత్వానికి మద్య ఎటువంటి వివాదాలు తలెత్తలేదు కానీ ఇప్పుడే వివాదాలు ఎందుకు వస్తున్నాయో ఆమె ఆలోచించుకోవాలి. కనుక గవర్నర్‌ రాజకీయాలకు దూరంగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది,” అని అన్నారు. 



Related Post