తెలంగాణ సిఎస్‌కు ప్రోటోకాల్ తెలియదా? తమిళిసై

April 06, 2022


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సిఎం కేసీఆర్‌తో సహా రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తన విషయంలో ప్రోటోకాల్ పాటించకపోవడం, తనతో సిఎం కేసీఆర్‌ విభేదించడానికి కారణం తదితర విషయాలన్నీ ఆమె ప్రధాని నరేంద్రమోడీకి వివరించినట్లు తెలుస్తోంది. 

అనంతరం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం, దానిని నడిపిస్తున్నవారు రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగబద్దమైన పదవులలో ఉన్నవారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజ్‌భవన్‌లో ఉన్నవారిని ఓ వ్యక్తిగా కాకుండా రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా పరిగణించి గౌరవించాలి. కానీ తెలంగాణలో సిఎస్‌ సైతం నా విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదు. ప్రోటోకాల్ పాటించాలని ఆయనకు తెలియదా?గవర్నర్‌ కోటాలో సమాజసేవా రంగం నుంచి వచ్చిన వ్యక్తిని ఆ పదవికి ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి ఉండగా రాజకీయ నేపధ్యం ఉన్న పాడి కౌశిక్‌ని సిఫార్సు చేసింది. కనుక ఆయనను ఎమ్మెల్సీగా నియమించకపోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అయినా అది నా విచక్షణాధికారానికి లోబడి జరిగే నియామకం కనుక దీనిపై అసలు వివాదమే లేదు. 

నా నిర్ణయంతో ఎవరి ఇగో అయినా దెబ్బతింటే దానికి నేనేమీ చేయలేను. నాకు ఎటువంటి ఇగోలు లేవు... ఎవరితోనూ విభేధాలు లేవు. నేను ఎవరితో విభేదాలు కోరుకోను కూడా. నేను అందరితో స్నేహపూర్వకంగానే ఉంటాను. కనుక సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉన్నతాధికారులు ఎప్పుడైనా రాజ్‌భవన్‌కు వచ్చి నన్ను కలవవచ్చు. తెలంగాణ జనాభాలో 11 శాతం ఉన్న గిరిజనుల సమస్యలు, వారి సంక్షేమం కోసం నేను చేపట్టిన చర్యల గురించి ప్రధాని నరేంద్రమోడీ వివరించాను,” అని చెప్పారు. 

గవర్నర్‌ తమిళిసై ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యి బయటకు రాగానే తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ పేరును నేరుగా ప్రస్తావించి, “ప్రోటోకాల్ పాటించాలని ఆయనకు తెలియదా?” అని ప్రశ్నించడం గమనిస్తే, త్వరలో ఆయనపై బదిలీ వేటు పడే అవకాశం ఉందనిపిస్తోంది. అలాగే ఇప్పటికైనా సిఎం కేసీఆర్‌ తీరు మార్చుకొని తనతో సయోధ్య పాటించాలని గవర్నర్‌ తమిళిసై సున్నితంగానే నొక్కి చెప్పారని భావించవచ్చు. 

ఇప్పటివరకు గవర్నర్‌ తమిళిసైకి ప్రభుత్వానికి మద్య కోల్డ్ వరంగల్‌లో సాగుతోంది. అది ఇకనైనా ముగుస్తుందో లేక ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందో త్వరలో అందరూ చూడవచ్చు. 


Related Post