ఉక్రెయిన్‌లో దయనీయ స్థితి.. పిల్లల వీపులపై వారి వివరాలు

April 06, 2022


img

దాదాపు నెలన్నర రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. మొదట్లో ఉక్రెయిన్‌ సైనికులతో పోరాడిన రష్యా ఇప్పుడు ప్రజల ఇళ్ళపై బాంబుల వర్షం కురిపిస్తూ వేలాదిమందిని పొట్టనబెట్టుకొంటోంది. రష్యన్ సైనికులు నిర్ధాక్షిణ్యంగా ప్రజలను హతమార్చుతున్నారు. ఇంతచేసినా నేటికీ ఉక్రెయిన్‌ ప్రజలు లొంగలేదు. ఆ దేశాన్ని రష్యా ఓడించలేకపోయింది. దీంతో ఇప్పుడు రష్యన్ సైనికులు మహిళలు, అభంశుభం తెలియని బాలికలపై అత్యాచార్యాలు, హత్యలు చేస్తూ యావత్ మానవజాతి సిగ్గుపడేవిదంగా హేయమైన నేరాలకు పాల్పడుతున్నారు. యావత్ ప్రపంచదేశాలు రష్యా వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు పుతీన్ వెనక్కుతగ్గడం లేదు కనీసం ఆయనలో అపరాధభావం కనిపించడం లేదు. 

నిరంతరంగా కొనసాగుతున్న రష్యా దాడులతో లక్షలాది ఉక్రెయిన్‌ ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని పొరుగుదేశాలకు వలసపోతున్నారు. అయితే ఈ దాడులలో తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి అత్యంతదయనీయంగా మారుతోంది. తల్లితండ్రులు ఏమయ్యారో తెలీని పరిస్థితులలో చిన్నారులు రోడ్లపైకి వచ్చి ఏడుస్తుంటే అది చూసి యావత్ ప్రపంచదేశాలలో ప్రజలు కన్నీళ్ళు పెట్టుకొంటున్నారు. 

ఇటీవల బాంబు దాడిలో తల్లితండ్రులను కోల్పోయిన ఓ ఐదారేళ్ళ అబ్బాయి చేతిలో చిన్న కుక్కబొమ్మను పట్టుకొని పొరుగు దేశానికి వలస వెళుతున్నవారితో కలిసి ఏడ్చుకొంటూ నడుస్తుంటే అది చూసి అందరి హృదయాలు ద్రవించాయి. 

అయితే ఇటువంటి బాలలు ఒకరో ఇద్దరో కాదు వందల సంఖ్యలో ఉన్నారు. దీంతో వలసలు పోతున్న ఉక్రెయిన్‌ ప్రజలు సైతం వారిని ఆడుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూస్తున్న ఉక్రెయిన్‌లోని తల్లితండ్రులు తమ చిన్నారుల వీపుల మీద మార్కర్ పెన్నుతో తమ పేర్లు, వారి పేరు, వయసు, చిరునామా, బంధుమిత్రుల ఫోన్‌ నెంబర్లు వగైరా వివరాలన్నీ వ్రాస్తున్నారు. ఒకవేళ బాంబు దాడిలో తాము చనిపోతే తమ పిల్లలను తమ బంధుమిత్రులు ఎవరైనా గుర్తించి చేరదీస్తారని కనీసం ఉక్రెయిన్‌ ప్రభుత్వం లేదా ఐక్యరాజ్య సమితి సిబ్బంది వారిని గుర్తించి ఆదుకొంటాయని ఆశపడుతున్నారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. 

రష్యా అధ్యక్షుడు పుతీన్ ఆవహించి ఉన్న సైతాన్ లేదా రాక్షసుడు ఇంకా ఎప్పటికీ విడిచిపెడతాడో తెలీదు కానీ అప్పటివరకు ఉక్రెయిన్‌లో అమాయకులైన ప్రజలు, మహిళలు, వృద్ధులు, చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి. కానీ రష్యా చేతిలో యావత్ ప్రపంచాన్ని వందసార్లు తుడిచిపెట్టేయగల భయంకరమైన అణుబాంబులు ఉండటంతో ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరప్ దేశాలతో సహా ఎవరూ పుతీన్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. మరి ఈ ఘోరకలి ఇంకా ఎంతకాలం సాగుతుందో? ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలో ఎవరికీ తెలీదు.


Related Post