అమిత్ షాతో గవర్నర్‌ తమిళిసై నేడు భేటీ...ఏమి జరుగబోతోందో?

April 06, 2022


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో ఓటమితో టిఆర్ఎస్‌ కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించి ధాన్యం కొనుగోలుతో సహా పలు అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తోంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై టిఆర్ఎస్‌ శ్రేణులు ధర్నా చేయనున్నాయి. అలాగే నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని సిఎం కేసీఆర్‌ శపదం చేసి వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం సిఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు గురించి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆహార, పురసరఫరాల మంత్రి పీయూష్ గోయల్‌తో చివరిసారిగా మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చి ఉన్నారు.   

ఈ సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా నుంచి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పిలుపు రావడంతో ఆమె మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకొన్నారు. ఈరోజు ఉదయం ఆమె అమిత్ షాతో భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్‌, ప్రభుత్వం అధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, సిఎం కేసీఆర్‌తో విభేధాలు, ప్రోటోకాల్ వివాదాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్రహోంమంత్రి అమిత్ షాకు వివరించి ఓ నివేదిక కూడా ఇవ్వనున్నారు. గవర్నర్‌ కోటాలో పాడి కౌశిక్‌ను ఎమ్మెల్సీగా నియమించాలని ప్రభుత్వం చేసిన సిఫార్సును గవర్నర్‌ తమిళిసై తిరస్కరించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్‌భవన్‌కు మద్య దూరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా తనను పదేపదే అవమానిస్తోందని గవర్నర్‌ తమిళిసై ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. కనుక నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకొంటారో?దాంతో రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగబోతున్నాయో? త్వరలోనే తెలుస్తుంది.


Related Post