టీఎస్‌ఆర్టీసీని కృంగదీస్తున్న డీజిల్‌ ధరలు

April 06, 2022


img

రోజురోజుకీ పెరుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు సామాన్యులనే కాదు టీఎస్‌ఆర్టీసీ వంటి పెద్ద సంస్థలను కూడా కృంగదీస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు డీజిల్‌తో నడుస్తుంటాయి కనుక నానాటికీ పెరుగుతున్న డీజిల్ ధరలతో టీఎస్‌ఆర్టీసీ మళ్ళీ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. గత 15 రోజులలో 13సార్లు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఈ రెండు వారాలలోనే డీజిల్ ధర లీటరుకి సుమారు రూ.11 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ ధర రూ.104.62కి చేరింది. 

నెలరోజుల క్రితం డీజిల్‌ ధరలు పెరగకముందు నుంచే టీఎస్‌ఆర్టీసీకి నష్టాలు వస్తున్నందున భద్రతా సెస్ పేరుతో ఛార్జీలు పెంచింది. బస్ పాస్ ఛార్జీలు భారీగా పెంచింది. అయినప్పటికీ రోజుకి రూ.6 కోట్లు నష్టాలు వస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నష్టాలు, కష్టాల నుంచి టీఎస్‌ఆర్టీసీని గట్టెక్కించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. ఎప్పటికప్పుడు అవకాశాలను అందిపుచ్చుకొంటూ, కొత్త కొత్త ఆలోచనలతో టీఎస్‌ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఓ పక్క ఈ నష్టాల ఊబిలో నుంచి టీఎస్‌ఆర్టీసీ బయటపడేందుకు గట్టిగా కృషి చేస్తుంటే మరోపక్క రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చేలా ఉంది. 

మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు టీఎస్‌ఆర్టీసీకి మరో కొత్త కష్టం కూడా వచ్చింది. ఇంతవరకు ఆయిల్ కంపెనీలు నిత్యం భారీగా డీజిల్ వినియోగించే టీఎస్‌ఆర్టీసీ వంటి సంస్థలకు నామమాత్రపు సబ్సీడీతో డీజిల్ సరఫరా చేసేవి. డీజిల్ ధరలు పెరిగినప్పటి నుంచి దానిని నిలిపివేశాయి. దీంతో టీఎస్‌ఆర్టీసీ నేరుగా పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడుకొని డీజిల్ పొందవలసి ఉంటుంది. అయితే నష్టాలలో నడుస్తున్న టీఎస్‌ఆర్టీసీకి ఏ పెట్రోల్ బంకు యజమాని అరువుపై డీజిల్ సరఫరా చేసే సాహసం చేయరని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ చేస్తే ఆ బంక్ యజమాని కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. 

కనుక టీఎస్‌ఆర్టీసీ కూడా సామాన్య ప్రజల మాదిరిగా తన బస్సులకు ప్రతీరోజు డబ్బు చెల్లించి డీజిల్ పోయించుకోవలసిరావచ్చు. ఇదే కనుక జరిగితే ఇక రోజూ ఎన్ని ఆర్టీసీ బస్సులు తిప్పగలదో ఎవరూ చెప్పలేరు. కనుక టీఎస్‌ఆర్టీసీకి పెరుగుతున్న డీజిల్ ధరలు మరో శాపం మారిందని చెప్పవచ్చు. మరి ఈ అగ్నిపరీక్షలో టీఎస్‌ఆర్టీసీ ఏవిదంగా నెగ్గుకొస్తుందో?ఒకవేళ నెగ్గలేకపోతే పరిస్థితి ఏమిటి? 


Related Post