టిఆర్ఎస్‌-బిజెపి యుద్ధం ముగిసేదెప్పుడో?

April 04, 2022


img

ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రప్రభుత్వంపై టిఆర్ఎస్‌ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసన దీక్షలు చేపట్టి కేంద్రప్రభుత్వం వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ శ్రేణులు నిరసన దీక్షలు చేస్తుండగా, సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో అమీతుమీ తేల్చుకొనేందుకు     ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. 

ఒకవేళ కేంద్రప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసన దీక్ష చేపట్టేందుకు టిఆర్ఎస్‌ సన్నాహాలు చేసుకొంటోంది. ఢిల్లీలో జరుగబోయే ఈ దీక్షకు బిజెపియేతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు సిఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఒత్తిడి పెంచి రాష్ట్రంలో పండిన బాయిల్డ్ రైస్ మొత్తం కొనుగోలు చేయించాలని భావిస్తున్నారు. 

కానీ రాష్ట్రంలో బిజెపి ఎదుగదలను అడ్డుకొనేందుకే సిఎం కేసీఆర్‌ బాయిల్డ్ రైస్ పేరుతో కేంద్రాన్ని నిందిస్తూ రాష్ట్ర ప్రజలను బిజెపికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు పేరుతో టిఆర్ఎస్‌ బిజెపిని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నందున, రాష్ట్ర బిజెపి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.  

రాష్ట్రంలో పండిన బాయిల్డ్ రైస్ మొత్తం కేంద్రమే కొనుగోలుచేయాలని సిఎం కేసీఆర్‌ పట్టుబడుతుంటే, ఎట్టి పరిస్థితులలో బాయిల్డ్ రైస్ కొనుగోలుచేయబోమని కేంద్రప్రభుత్వం పదేపదే గట్టిగా చెపుతోంది. కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఈ పేరుతో సాగుతున్న ఆధిపత్యపోరు ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది?ఎప్పటికి ఏవిదంగా ముగుస్తుందంటే, ఇది టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు గనుక బహుశః శాసనసభ ఎన్నికల వరకు కొనసాగవచ్చు.   



Related Post