ప్రభుత్వం చిత్తశుద్ధికి మరో పరీక్ష..కటినంగా వ్యవహరించగలదా?

April 04, 2022


img

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి మత్తుమందులు స్వాధీనం చేసుకొని 148 మందిని అదుపులోకి తీసుకొని వారి వివరాలు సేకరించి పంపించివేశారు. 

ఈ దాడిలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి చెందిన ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ దాడిలో ఎల్.ఎస్.డి., ఎండీఎంఏ, హెరాయిన్ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొని వాటిని సేవిస్తున్న యువతీయువకులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నారు. అయితే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎవరినీ అదుపులో తీసుకోకుండా అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వారి వివరాలు నోట్ చేసుకొని పంపించివేయడం అనుమానాలకు తావిస్తోంది. 

రెండు రోజుల క్రితమే నగరంలో మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్ ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఈ గ్యాంగ్‌లన్నిటినీ నడిపిస్తున్న లక్ష్మీపతి అనే వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా మర్నాడే నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేయగలగడం చూస్తే ఈ నెట్‌వర్క్ ఎంత బలమైనదో అర్ధం చేసుకోవచ్చు. మాదకద్రవ్యాల ముఠాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఇకపై మాదకద్రవ్యాలు సేవించేవారు ఎంత పెద్దవారైనప్పటికీ ఉపేక్షించబోమని నగర పోలీస్ కమీషనర్‌ సివి ఆనంద్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక నిన్న తెల్లవారుజామున రేవ్ పార్టీలో పట్టుబడిన ప్రముఖుల పిల్లలపై కేసులు నమోదు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవలసి ఉంటుంది లేకుంటే మాదకద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయడం మాటలకే పరిమితం అని భావించవచ్చు.



Related Post