గవర్నర్‌ జిల్లా పర్యటన...మొహం చాటేసిన మంత్రులు

March 30, 2022


img

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం హనుమకొండ జిల్లా సుబేదారీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రెండు రోజులపాటు సాగే జాతీయ సంస్కృతీ మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజీలో ఏర్పాటు చేసిన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తెలుగు వీరుల ఫోటో గ్యాలరీని ఆమె సందర్శించారు. ఈ సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనేందుకు వివిద రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులను గవర్నర్‌ తమిళిసై ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. భిన్న సంస్కృతులు, భాషలతో అలరారే భారతదేశంలో ప్రజలందరినీ కలిపేవి కళలేనని ఆమె అన్నారు. జాతీయ స్థాయిలో ఇటువంటి సంస్కృతీ మహోత్సవం నిర్వహించే అవకాశం హన్మకొండకు దక్కినందుకు ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర గవర్నర్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు వచ్చి స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడటం ఆనవాయితీ. కానీ సిఎం కేసీఆరే ఆమెకు దూరంగా మసులుతున్నందున జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మొహం చాటేశారు. 

ఇటీవల గవర్నర్‌ తమిళిసై ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వచ్చి చాలా కాలమే అయ్యింది. కనుక రాజ్‌భవన్‌లో నిర్వహించబోయే ఉగాది వేడుకలకు ఆయనను, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార, ప్రతిపక్ష నేతలు అందరినీ ఆహ్వానిస్తాను. సిఎం కేసీఆర్‌ నా ఆహ్వానాన్ని మన్నించి వస్తారనే ఆశిస్తున్నాను. ఆయనతో నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒకవేళ ఆయన ఉన్నాయనుకొంటే ఈ ఉగాదితో అవన్నీ తొలగిపోవాలని కోరుకొంటున్నాను. 

గవర్నర్‌ అనేది రాజ్యాంగబద్దమైన పదవి. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత. కనుక ఇద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి. నా అధికారాలు, పరిమితులు నాకు తెలుసు. నేను ఎన్నడూ నా పరిధి దాటి ప్రవర్తించను. నావైపు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి సమస్యలు సృష్టించను. నాకు చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వాటిని బలవంతంగా ఎవరిపై రుద్దను. అలాగే నా మంచితనాన్ని, స్నేహపూర్వకంగా మసలడాన్ని ఎవరైనా అలుసుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే నేను అంగీకరించను. నేను ఎల్లప్పుడూ నా విచక్షణా జ్ఞానంతోనే వ్యవహరిస్తుంటాను. నాపై ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఒత్తిళ్ళకు లొంగేరకం కాదు నేను. అందుకే రాజకీయ నేపద్యం కలిగిన పాడి కౌశిక్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయలేదు. నా నిర్ణయాన్ని సిఎం కేసీఆర్‌ తప్పుగా భావించి రాజ్‌భవన్‌తో గ్యాప్ పెంచుకొంటే నేనేమి చేయలేను. అయినా ఈ ఉగాది వేడుకలతో ఆ గ్యాప్ తొలగించేందుకు ప్రయత్నిస్తాను,” అని తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు.


Related Post