ప్రధాని మోడీకి సిఎం కేసీఆర్‌ లేఖ..ఎలా స్పందిస్తారో

March 30, 2022


img

ప్రధాని నరేంద్రమోడీకి సిఎం కేసీఆర్‌ మంగళవారం ఓ లేఖ వ్రాశారు. దానిలో ఉక్రెయిన్‌ నుంచి ఇటీవల తిరిగివచ్చిన సుమారు 20 వేల మంది వైద్య విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిబందనలు సడలించి, వారందరూ భారత్‌లోని వైద్య కళాశాలలో మిగిలిన కోర్సును పూర్తి చేసేందుకు తోడ్పడవలసిందిగా సిఎం కేసీఆర్‌ కోరారు. మద్యతరగతికి చెందిన వారి తల్లితండ్రులు తమ జీవితకాల కష్టార్జితాన్ని అంతా ఖర్చు చేసి వారిని ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసించడానికి పంపిస్తే, యుద్ధం కారణంగా వారు విధిలేని పరిస్థితులలో చదువులు మానుకొని భారత్‌ తిరిగి వచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం వారిని ఆదుకోకపోతే వారి భవిష్యత్‌ అంధకారం అవుతుందని సిఎం కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 700 మంది వైద్య విద్యార్ధుల చదువులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే వారి ఫీజులు చెల్లించేందుకు సిద్దంగా ఉందని సిఎం కేసీఆర్‌ తెలియజేశారు. కనుక కేంద్రప్రభుత్వం కూడా మానవతాదృక్పదంతో తక్షణమే దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సిఎం కేసీఆర్‌ లేఖలో ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. 

ఇటువంటి ఆలోచన ముందుగా కేంద్రప్రభుత్వానికి వచ్చి ఉంటే బాగుండేది కానీ కేంద్రంపై కత్తులు దూస్తున్న సిఎం కేసీఆర్‌ ఈ ప్రతిపాదన చేశారు. ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకొంటే సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు దీని గురించి గొప్పగా చెప్పుకొంటారు. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే, అప్పుడు కూడా వారు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక ఈ ప్రతిపాదనపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్నా దాని వలన టిఆర్ఎస్‌ పార్టీకే ఎంతో కొంత మైలేజీ లభిస్తుందని అర్దమవుతోంది. సిఎం కేసీఆర్‌ అటువంటి ఆలోచనతో ఈ ప్రతిపాదన చేయలేదు కానీ చివరికి జరిగేది అదే. కనుక సిఎం కేసీఆర్‌ చేసిన ఈ ప్రతిపాదనపై కేంద్రం ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.  


Related Post