అవును..వారితో గ్యాప్ పెరిగింది

March 29, 2022


img

సోమవారం యాదాద్రి ఉద్ఘాటన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఆలోచనకు బీజం వేసి సిఎం కేసీఆర్‌కు అడుగడుగునా మార్గదర్శనం చేసిన త్రిదండి చినజీయర్ స్వామిని ఆహ్వానించలేదు. అలాగే రాష్ట్ర ప్రధమ మహిళ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కూడా ఆహ్వానించలేదు. ప్రతిపక్ష నేతలెవరినీ కూడా ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమంలో సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్‌ ప్రముఖులు, సామాన్య ప్రజలు మాత్రమే పాల్గొన్నారు. 

ఇటీవల జీయర్ స్వామి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “మాకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు. వాళ్ళకు వాళ్ళు గ్యాప్స్ పెట్టుకొంటే మేము చేయగలిగిందేమీ ఉండదు. యాదాద్రి ఉద్ఘాటనకు ఆహ్వానిస్తే వెళ్తాము లేకుంటే చూసి ఆనందిస్తాము. మేము ఎవరితోనూ రాసుకుపూసుకు తిరగము. ఎవరైనా వచ్చి సలహా అడిగితే చెపుతాము అంతే,” అని అన్నారు. ఆయన సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించే ఈ మాటలు అన్నారని అందరికీ తెలుసు.  

ఆ తరువాత సిఎం కేసీఆర్‌ శాసనసభలో మాట్లాడుతూ, “జీయర్ స్వామితో నాకు ఎటువంటి విభేధాలు లేవు,” అని అన్నారు. కనుక యాదాద్రి ఉద్ఘాటనకు జీయర్ స్వామిని ఆహ్వానిస్తారని అందరూ భావించారు. కానీ ఆహ్వానించకపోవడంతో వారి మద్య గ్యాప్ ఉందని స్పష్టమైంది. ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించి ఆ సందర్భంగా జీయర్ స్వామి ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడినప్పటి నుంచే సిఎం కేసీఆర్‌ జీయర్ స్వామిని దూరం పెట్టడం ప్రారంభం అయ్యింది. యాదాద్రి ఉద్ఘాటనకు ఆహ్వానించకుండా ఆ గ్యాప్ మరింత పెంచినట్లు అర్ధమవుతోంది. ఇది జీయర్ స్వామికి చాలా అవమానకరమైన విషయమే.

గవర్నర్‌ కోటాలో పాడి కౌశిక్‌ను ఎమ్మెల్సీగా నియమించాలని సిఎం కేసీఆర్‌ చేసిన సిఫార్సును తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించడంతో వారి మద్య గ్యాప్ పెరిగింది. ఆ తరువాత ఆమెకు ప్రభుత్వం నుంచి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. యాదాద్రి ఉద్ఘాటనకు ఆహ్వానించకపోవడం ఆ జాబితాలో మరొకటి.  

ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను సిఎం కేసీఆర్‌ ఏనాడూ గౌరవించిన దాఖలాలు లేవు. కనుక యాదాద్రి ఉద్ఘాటనకు వారిని దూరం పెట్టారనుకోవచ్చు. 

అయితే సిఎం కేసీఆర్‌ ఈవిదంగా అందరితో గ్యాప్ పెంచుకొంటూ పోతే చివరికి ఒంటరివారయ్యే ప్రమాదం ఉంటుంది. సిఎం కేసీఆర్‌కు భయపడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, టిఆర్ఎస్‌ నేతలు ఆయనను నిర్ణయాలను గట్టిగా సమర్ధిస్తుండవచ్చు కానీ లోలోన వ్యతిరేకిస్తుండవచ్చు. వారిలో సిఎం కేసీఆర్‌ పట్ల అసంతృప్తి మొదలైతే అది ఇప్పుడు బయటపడదు ఎన్నికల సమయంలో బయటపడుతుంది. అదే కనుక జరిగితే టిఆర్ఎస్‌ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంటుందని మరిచిపోకూడదు.


Related Post