పంజాబ్ సిఎం నిర్ణయం దేశానికే ఆదర్శం

March 26, 2022


img

పంజాబ్‌లో కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన భగవంత్ మాన్ ఈరోజు చాలా సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గెలిచినప్పటికీ వారికి ఒక్క పదవీ కాలనికి మాత్రమే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు లెక్కన పెన్షన్ శాతం పెరుగుతుండేది. మొదటిసారి గెలిస్తే 75 వేలు, మళ్ళీ ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు 66 శాతం చొప్పున కలిపి ఒక్కో ఎమ్మెల్యే పదవీకాలం పూర్తయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా పెన్షన్ చెల్లిస్తుంటుంది. 

పంజాబ్‌లో ఈవిదంగా నెలకు రూ.3.50 నుంచి 5.25 లక్షల వరకు పెన్షన్ తీసుకొంటున్న ఎమ్మెల్యేలు 250 మంది వరకు ఉన్నారు. వారి పెన్షన్లకే ఖజానా సగం ఖాళీ అయిపోతుండటంతో ఎమ్మెల్యేల పెన్షన్ విధానంలో మార్పు చేస్తున్నట్లు పంజాబ్‌ సిఎం భగవంత్ మాన్ తెలిపారు. 

దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ సైతం హర్షం వ్యక్తం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే భగవంత్‌ మాన్ సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన ఈ నిర్ణయంపై ప్రశంశలు కురిపిస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న ధరలతో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలు పెంచుకొంటాయి తప్ప ఏనాడూ ఇటువంటి గొప్ప ఆలోచన చేసిన దాఖలాలు లేవు. కనుక ఇకనైనా పంజాబ్‌ సిఎం భగవంత్ మాన్ స్పూర్తితో అన్ని రాష్ట్రాలు ఈ విదానాన్ని అమలుచేస్తే ఖజానాపై భారం తగ్గుతుంది. ఆ సొమ్మును ప్రజావసరాలకు ఖర్చు చేయవచ్చు.



Related Post