కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిషోర్‌ మళ్ళీ దోస్తీ?

March 26, 2022


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశమైనప్పుడు ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎంతగా శ్రమించినా ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఓడిపోవడం యూపీలో కేవలం 3 సీట్లకే పరిమితం కావడం కాంగ్రెస్‌ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

వచ్చే ఏడాది చివరిలోగా వరుసగా గుజరాత్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ శాసనసభ  ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికలలో గెలవలేకపోతే వాటి తరువాత జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. 

కాంగ్రెస్‌లో సీనియర్లు సోనియా, రాహుల్ గాంధీ పక్కకు తప్పుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే వరుస ఎన్నికలలో గట్టెక్కించడం కాంగ్రెస్‌ అధిష్టానం వలన కాదని స్పష్టమైంది. 

కనుక దేశంలో అన్ని పార్టీలను గట్టెక్కిస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించే బాధ్యత అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్‌ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇదివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు కనుక ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేయబోతున్నట్లయితే తెలంగాణలో ఏమి చేస్తారు? ఆయన తమతో కలిసి పనిచేస్తున్నారని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు కదా?అప్పుడు టిఆర్ఎస్‌కు కటీఫ్ చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పనిచేస్తారా లేక కాంగ్రెస్, టిఆర్ఎస్‌ పార్టీలను దోస్తీ చేయించి బిజెపికి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయిస్తారా? రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 


Related Post