గవర్నర్‌ తమిళిసై నాగర్‌కర్నూల్‌ పర్యటన...ఏమి జరుగుతుందో?

March 26, 2022


img

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. పోషకాహారం, సమగ్ర అభివృద్ధి  కార్యక్రమం అమలుకు ఎంపిక చేసిన ఆరు గ్రామాలలో జిల్లాలోని అప్పాపూర్, బౌరాపూర్ గ్రామాలున్నాయి. గవర్నర్‌ తమిళిసై శనివారం ఆ రెండు గ్రామాలలో పర్యటించి అక్కడి చెంచు ప్రజలతో ముఖాముఖీ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, సమస్యల గురించి అడిగి తెలుసుకొంటారు. అనంతరం ఆ రెండు గ్రామాల సర్పంచ్‌లకు అంబులెన్స్ బైక్‌లు అందజేస్తారు.  ఈరోజు పర్యటనలో భాగంగా ఆమె జిల్లాలో ఏర్పాటు చేసిన ఉప ఆరోగ్య కేంద్రం, టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఆశ్రమ్ పాఠశాలను కూడా సందర్శిస్తారు.    

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ప్రభుత్వం మద్య ఇప్పటికే దూరం పెరిగింది. రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్రదినోత్సవానికి సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం , సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వెళ్ళేందుకు హెలికాప్టర్‌ ఏర్పాటు చేయాలని కోరినా ఆమె కోరినా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం, దాంతో ఆమె 300 కిమీ కారులో ప్రయాణించి మేడారం చేరుకొన్నప్పుడు, ప్రోటోకాల్ ప్రకారం అక్కడ మంత్రులు, జిల్లా అధికారులు హాజరై ఆమెకు ఆహ్వానం పలకవలసి ఉండగా ఎవరూ రాకపోవడం, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ఆమెను ఆహ్వానించకపోవడం వంటి అనేక పరిణామాల పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 

ఈ నేపధ్యంలో ఆమె ఇవాళ్ళ నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనకు బయలుదేరుతుండటంతో ఇప్పుడైనా ప్రభుత్వం ఆమె పర్యటనకు ఏర్పాట్లు చేసి గౌరవిస్తుందా లేదా?ముఖ్యంగా ఆమె నల్లమల అటవీ ప్రాంతంలోని గ్రామాలకు నేడు వెళుతున్నందున ఆమెకు ప్రభుత్వమే భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోతే గవర్నర్‌కు ప్రభుత్వానికి మద్య మరింత దూరం పెరిగి అది రాజకీయ యుద్ధానికి దారి తీయవచ్చు.


Related Post