సినిమా ఫ్లాప్‌ అయితే నటీనటులకు బాధ్యత ఉండదా?

March 24, 2022


img

ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం సదరు హీరో లేదా హీరోయిన్‌కే దక్కుతుంటుంది. దాంతో వారు తమ పారితోషికం అమాంతం పెంచేస్తుంటారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే దాంతో తమకు సంబందమే లేనట్లు వ్యవహరిస్తుంటారు. సినిమా హిట్ అయితే దాని క్రెడిట్ మొత్తం ఆనందంగా స్వీకరించే నటీనటులు, దర్శకుడు, సంగీత దర్శకుడు అది ఫ్లాప్ అయినప్పుడు కూడా బాధ్యత తీసుకోవడం కనీస ధర్మం. 

భారీ బడ్జెట్‌తో తీసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే అది నిర్మాతలకు, వారికి ఫైనాన్స్ చేసినవారికి, సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు తీరని నష్టం మిగుల్చుతుందని వేరే చెప్పక్కరలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తాను తీసుకొన్న పారితోషికంలో నుంచి కొంత తిరిగి ఇచ్చేస్తుంటారు. కానీ మన తెలుగు పరిశ్రమలో భారీ పారితోషికాలు తీసుకొనే నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు అటువంటి ఆలోచన కూడా చేసిన దాఖలాలు లేవు. సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టం భరించడం మాట దేవుడెరుగు, కనీసం తరువాత సినిమాకైనా తమ పారితోషికం తగ్గించుకోవాలనుకోరు. 

సినిమా బడ్జెట్‌లో దాదాపు 40-50 శాతం పారితోషికాలకే ఖర్చు చేయవలసి వస్తోంది గనుకనే సినిమాల బడ్జెట్‌ పెరిగిపోతోందని అర్ధమవుతోంది. కానీ వారు తమ పారితోషికాలు ఏమాత్రం తగ్గించుకోకుండా సినిమాపై పెట్టిన పెట్టుబడి, దానిపై లాభాల కోసం టికెట్ ధరలు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుండటం, తమ పారితోషికాల భారాన్ని ప్రేక్షకుల భరించాలని ఆశిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

సినిమా ఇండస్ట్రీ వలననే ఇంత డబ్బు, అభిమానుల ఆదరణ, కీర్తి ప్రతిష్టలు పొందుతున్నామని కనుక దానిని పదిలంగా కాపాడుకోవాలని హీరోహీరోయిన్లు ప్రయత్నించాలి తప్ప ఇండస్ట్రీ మునిగిపోయినా పర్వాలేదు మాకు మా పారితోషికాలే ముఖ్యం అనుకొంటే కూర్చోన్న కొమ్మను నరుకొన్నట్లే అని గ్రహిస్తే మంచిది.  


Related Post