ప్రశాంత్ కిషోర్‌ ఎంట్రీతో తెలంగాణలో ఎవరికి నష్టం?

March 24, 2022


img

అగ్నికి ఆజ్యం పోసినట్లు...నిప్పుకి గాలి తోడైనట్లు అనే పదాలు తరచు వింటుంటాము ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. అపర చాణక్యుడు అని పేరుమోసిన సిఎం కేసీఆర్‌కు బిజెపితో సహా అనేక ప్రాంతీయ పార్టీలను ఎన్నికలలో గెలిపించిన ప్రశాంత్ కిషోర్‌ తోడయ్యారు. దీంతో కేసీఆర్‌-కిషోర్ డెడ్లీ కాంబినేషన్‌గా మారింది. 

ఇంతకాలం ఒక్క కేసీఆర్‌నే ఎదుర్కోలేక ఆపసోపాలుపడుతున్న ప్రతిపక్షాలకు ఇప్పుడు వారిద్దరినీ ఎదుర్కోవడం ఇంకా కష్టంగా మారుతుంది. బహుశః అసంభవం కావచ్చు. ఇప్పటివరకు వారిరువురు చేతులు కలపడంపై ఊహాగానాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలకు సిఎం కేసీఆర్‌ “అవును... ప్రశాంత్ కిషోర్‌ మాతో కలిసి పనిచేస్తున్నారు,” అని మొన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. కనుక ఇక ఊహాగానాలు అవసరం లేదు...వారిద్దరినీ ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్దం చేసుకోవలసి ఉంటుంది. 

ప్రశాంత్ కిషోర్‌ తమ బూత్ స్థాయి కార్యకర్తతో సమానమని బిజెపి కొట్టి పారేసినప్పటికీ, ఓటమి భయంతోనే సిఎం కేసీఆర్‌ ఆయనను తెచ్చుకొన్నారని కాంగ్రెస్‌ వాదిస్తున్నప్పటికీ, ఆయన ఎంట్రీతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు నష్టపోవడం తద్యం. ప్రశాంత్ కిషోర్‌ ఇచ్చిన కొన్ని ఐడియాలతోనే సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బిజెపిని ఊపిరి సలుపుకొనీయకుండా చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. టిఆర్ఎస్‌, బిజెపి మద్య యుద్ధ తీవ్రత పెరిగితే ముందుగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే అని ఉపఎన్నికలలో రుజువైంది. కనుక ప్రశాంత్ కిషోర్‌ ఎంట్రీతో బిజెపితో పాటు కాంగ్రెస్‌ కూడా నష్టపోవచ్చు. 

అయితే ఆయన రాకతో టిఆర్ఎస్‌కు అంతా మేలే జరుగుతుందని కూడా చెప్పలేము. ఇంతకాలం టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరూ తమకే మళ్ళీ టికెట్ వస్తుందని నిశ్చింతగా ఉండేవారు. కానీ ఇప్పుడు టికెట్ రావాలంటే ప్రశాంత్ కిషోర్‌ కటాక్షం చాలా అవసరం. ఒకవేళ ఆయన నెగెటివ్ రిపోర్ట్ ఇస్తే సిఎం కేసీఆర్‌ వాళ్ళని పక్కనపెట్టేయవచ్చు. కనుక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో అభద్రతాభావం మొదలైందని చెప్పక తప్పదు. ఇదో సమస్య అనుకొంటే, వారిలో అభద్రతాభావం పెరిగితే కాంగ్రెస్‌, బిజెపిలోకి దూకేసే ప్రమాదం కూడా ఉంటుంది. దాని వలన టిఆర్ఎస్‌కు నష్టం కలుగవచ్చు. అంటే ప్రశాంత్ కిషోర్‌ తెలంగాణలో ఎంట్రీతో కాంగ్రెస్‌, బిజెపిలతో పాటు టిఆర్ఎస్‌ కూడా నష్టపోయే ప్రమాదం ఉందని అర్దమవుతోంది. మరి ప్రశాంత్ కిషోర్‌ దెబ్బకి ఎవరు బలవుతారో ఎవరు లబ్ది పొందుతారో తెలియాలంటే వచ్చే శాసనసభ ఎన్నికల ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే. 


Related Post