ఉక్రెయిన్‌ను నాశనం చేసి రష్యా ఏమి సాధించింది?

March 24, 2022


img

ఫిబ్రవరి 24న తెల్లవారుజాము 4 గంటలకు ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకు పడటం ప్రారంభించింది. అంటే నేటికీ నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు వారాలలో రష్యా దళాలు ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపించి వేలాది భవనాలను నేలమట్టం చేశాయి. వేలాదిమంది ప్రజలు, పసిపిల్లలు పుతీన్ నరమేధంలో ప్రాణాలు కోల్పోయారు. సుమారు కోటిమంది నిరాశ్రయులయ్యారు. వారిలో చాలామంది దేశం విడిచి పొరుగు దేశాలకు వెళ్ళిపోయారు. దీంతో ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. నాలుగు వారాలలో ఇంత విధ్వంసం సృష్టించినా నేటికీ రష్యా ఉక్రెయిన్‌ను ఓడించలేకపోయింది. కనీసం ఉక్రెయిన్‌లో కీలక నగరాలపై పూర్తిగా పట్టుసాధించలేకపోయింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి ఆ దేశాన్ని నాటోలో చేరకుండా అడ్డుకోవాలనుకొంది. ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు భాగాలపై రష్యా ఆధిపత్యాన్ని అంగీకరింపజేయాలనుకొంది. భవిష్యత్‌లో యూరోప్ దేశాలు రష్యా వైపు కన్నెత్తి చూడకుండా చేయాలనుకొంది. కానీ నాలుగు వారాలుగా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నా ఈ మూడు లక్ష్యాలు నెరవేరలేదని పుతీన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ మీడియా ముందు అంగీకరించారు. 

ఉక్రెయిన్‌ను లొంగదీసుకొని తనకు తిరుగులేదని రష్యా నిరూపించుకోవాలనుకొంది. కానీ అందుకు పూర్తి విరుద్దంగా జరుగుతోంది. రష్యాకు చెందిన పలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, సైనికులను, అనేక ఆయుధాలను కోల్పోయింది. అమెరికా, యూరోప్ దేశాలు విధించిన పలు ఆంక్షలతో రష్యా ప్రజలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో రష్యా ప్రజలే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌ ప్రజలపై బాంబులు కురిపిస్తున్న పుతీన్ ఓ యుద్ధ నేరస్థుడు, ఐసిస్, తాలిబన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాది అని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.    

ఇక నాటో దేశాల నుంచి ఉక్రెయిన్‌ను వేరు చేయాలని పుతీన్ భావిస్తే, ఈ యుద్ధంతో అవి మరింత దగ్గరయ్యాయి. అవి అవసరమైన ఆయుధాలు, నిధులు అందిస్తూ తోడ్పడుతుండటంతో ఉక్రెయిన్‌ కూడా ఇప్పుడు మరింత ధైర్యంగా పోరాడుతోంది. దీంతో మూడు నాలుగు రోజులలో ముగిసిపోతుందనుకొన్న ఈ యుద్ధం నాలుగు వారాలైనా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వెనక్కు తగ్గితే ప్రపంచదేశాల ముందు తలదించుకోవలసి ఉంటుంది. అలాగని యుద్ధం కొనసాగిస్తే ఇంకా నష్టపోతూ ప్రపంచదేశాల దృష్టిలో ఇంకా హీనుడిగా మారిపోతారు. కనుక పుతీన్ ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు మొదలుపెట్టానా?అని తలపట్టుకొని కూర్చోవలసి వస్తోంది.


Related Post