తెలంగాణలో ధాన్యం రాజకీయాలు

March 23, 2022


img

తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని లేకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఈసారి ఆ ఉద్యమం ఆషామాషీగా ఉండబోదని సిఎం కేసీఆర్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. అయితే ఈసారి రారైస్ మాత్రమే కొంటామని బాయిల్డ్ రైస్‌ కొనబోమని కేంద్రప్రభుత్వం ఇదివరకే చెప్పింది. అప్పుడే టిఆర్ఎస్‌ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసింది. మళ్ళీ మరోసారి ఆందోళనలు చేయడానికి సన్నాహాలు చేసుకొంటోంది. 

అయితే రాష్ట్రంలో నానాటికీ బలపడుతున్న బిజెపిని రాజకీయంగా దెబ్బ తీసి వచ్చే ఎన్నికలలో దాని వలన టిఆర్ఎస్‌కు ఇబ్బందిలేకుండా చేసుకోవాలనే ధాన్యం కొనుగోలు పేరుతో టిఆర్ఎస్‌ కేంద్రంపై కత్తులు దూస్తోందని అర్ధమవుతూనే ఉంది. వరి రైతుల ఆగ్రహాన్ని బిజెపికి మళ్ళించి తాను బయటపడాలని టిఆర్ఎస్‌ యోచనగా కనిపిస్తోంది. 

అయితే బిజెపి కూడా రెండు నాల్కలతో మాట్లాడుతోంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రారైస్ మాత్రమే కొంటామని బాయిల్డ్ రైస్‌ కొనబోమని స్పష్టంగా చెపుతుంటే, బండి సంజయ్‌ మొన్న ఢిల్లీ వెళ్ళి ఆయనను కలిసి వచ్చిన తరువాత రాష్ట్రంలో పండే ప్రతీ ధాన్యం గింజను కేంద్రమే కొంటుందని, సిఎం కేసీఆరే మాట మార్చి వడ్లు కొనాలంటూ కొత్త డ్రామా మొదలుపెట్టి రైతులను మోసం చేస్తున్నారని వాదిస్తున్నారు. తద్వారా సిఎం కేసీఆర్‌ను వరి రైతుల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.  

ఈవిదంగా టిఆర్ఎస్‌, బిజెపిలు ధాన్యం కొనుగోలు పేరుతో రాజకీయ ఆధిపత్యపోరు చేస్తుంటే, త్వరలో పంట చేతికి వస్తే తాము ఏమి చేయాలో అని వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


Related Post