భారత్‌పై పాక్‌ పొగడ్తలు..అమెరికా విమర్శలు!

March 22, 2022


img

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ విదేశాంగ వైఖరిని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించడం విశేషం. గత నాలుగైదు దశాబ్ధాలుగా భారత్‌ను అస్థిరపరిచేందుకు ఉగ్రమూకలతో విఫలయత్నాలు చేస్తున్న పాక్‌ భారత్‌ను హటాత్తుగా ఎందుకు ప్రశంసించింది?దశాబ్ధాలుగా అమెరికాతో బలమైన స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ భారత్‌ను అమెరికా ఎందుకు విమర్శించింది? అని ప్రశ్నించుకొంటే ఆసక్తికరమైన సమాధానాలు కనిపిస్తాయి. 

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పాక్‌లో ప్రధాని పదవి అంటే పులి మీద సవారీ వంటిదే అని చెప్పక తప్పదు. పదవిలో ఉంటే ఐఎస్ఎస్, సైన్యాధికారుల పెత్తనాన్ని, ప్రతిపక్షాల విమర్శలను, దయనీయ జీవితాలు గడుపుతున్నందుకు పాక్‌ ప్రజల శాపనార్ధాలను నిత్యం భరించాల్సి ఉంటుంది. ఒకవేళ కర్మకాలి సైన్యమో, ప్రతిపక్షాలో తిరుగుబాటు చేసి బలవంతంగా ప్రధాని పదవిలో నుంచి దించేస్తే వెంటనే దేశం విడిచిపారిపోక తప్పదు. లేకుంటే అవినీతి ఆరోపణలపై జైలుకో లేదా ఊరికొయ్యకో వ్రేలాడే ప్రమాదం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. అందుకే భారత్‌ను ప్రసన్నం చేసుకొని మద్దతు పొందేందుకు చూస్తున్నారేమో?లేకుంటే భారత్‌ విదేశాంగ వైఖరిని పొగడాల్సిన అవసరం ఏముంది? 

రష్యాతో మొదటి నుంచి అమెరికాకు శతృత్వం ఉంది. ఇప్పుడు ఈ యుద్ధంతో అది ఇంకా పెరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు యూరప్ దేశాలకు విస్తరిస్తే తీవ్రంగా నష్టపోతాయి కనుకనే రష్యాతో ప్రత్యక్షంగా యుద్ధానికి దిగలేక ఆంక్షలతో సరిపెడుతున్నాయి. కనుక అవి తమ దేశ ప్రయోజనాల గురించి ఏవిదంగా ఆలోచిస్తున్నాయో అదేవిదంగా భారత్‌ కూడా ఆలోచిస్తోంది. 

శ్రీలంకలాగ చమురు సంక్షోభంలో చిక్కుకొని ఇతర దేశాలను ‘దేహీ..’ అని ప్రపంచ దేశాలను యాచించే పరిస్థితి రాకుండా రష్యా తక్కువ ధరకు ఇస్తున్న చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌ సిద్దపడింది. అయినా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అమెరికా, యూరప్ దేశాలే రష్యాను ఏమాత్రం కట్టడిచేయలేకపోతున్నప్పుడు భారత్‌ ఆంక్షలు విధిస్తే రష్యా దిగిరాదని జో బైడెన్‌కు తెలుసు. కానీ తాము ఆంక్షలు విధించినప్పుడు భారత్‌ కూడా తమ మార్గంలో నడవాలని కోరుకోవడం సహజం. అందుకే భారత్‌ వైఖరిని విమర్శిస్తున్నారనుకోవచ్చు. కానీ అమెరికా, యూరప్ దేశాలు ఏమనుకొంటాయో అని భారత్‌ ప్రయోజనాలను పక్కనపెట్టలేము కదా? 

అమెరికా, నాటో దేశాలను నమ్ముకొనందుకు నిండా మునిగామని, భారీ మూల్యం చెల్లిస్తున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ అని అన్నారు. కనుక ఒకవేళ మనం వాటిని నమ్ముకొంటే మనకీ అదే పరిస్థితి ఎదురవవచ్చు. అందుకే భారత్‌ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. 


Related Post