ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్‌ దోస్తీ సరైన నిర్ణయమేనా?

March 22, 2022


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో సిఎం కేసీఆర్‌ భేటీలపై మీడియా, సోషల్ మీడియాలో వినిపిస్తున్న గుసగుసలపై సిఎం కేసీఆర్‌ నిన్న పూర్తి స్పష్టత ఇచ్చేశారు. తామిద్దరం మంచి దోస్తులమని, కలిసి పనిచేయబోతున్నామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. అంతే కాదు...ఆయన చాలా నిస్వార్ధపరుడని ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. తమకు సాయపడుతున్నందుకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకోవడంలేదని చెప్పారు. దేశం కోసమే తామిద్దరం కలిసి పనిచేయబోతున్నట్లు చెప్పారు. 

అయితే తన తెలివితేటలే పెట్టుబడిగా రాజకీయాలతో వ్యాపారం మొదలుపెట్టి బాగా రాణిస్తున్న దేశంలోని మొట్టమొదటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్‌ అని అందరికీ తెలుసు. మొదట బిజెపి, నరేంద్రమోడీ కోసం పనిచేసిన అతను ఆ తరువాత బిజెపికి బద్ద శత్రువులైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు పనిచేశారు. ఏపీలో వైసీపీకి పని చేసిన అతను ఇప్పుడు దాంతో విభేదిస్తున్న టిఆర్ఎస్‌కు పనిచేస్తున్నారు. అంటే.. ఆ పార్టీ... ఈ పార్టీ అని చూడకుండా డబ్బు, సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని అర్దమవుతోంది. అతనికి నిర్ధిష్టమైన సిద్దాంతాలు, ఆశయాలు ఏవీలేవని కూడా అర్ధమవుతోంది. అటువంటి వ్యక్తి దేశ ప్రయోజనాల కోసం ఒక్క పైసా ఆశించకుండా పనిచేస్తున్నాడని, అతనితో తాను కలిసి పనిచేస్తానని చెప్పడం వలన సిఎం కేసీఆర్‌ విశ్వసనీయత దెబ్బ తింటుంది తప్ప అతనిది కాదు.  

ప్రశాంత్ కిషోర్‌ సూచన మేరకే సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బిజెపిపై ఫోకస్ పెట్టారని, రాష్ట్రంలో బిజెపిని కట్టడి చేసేందుకే ధాన్యం కొనుగోలు పేరుతో కేంద్రంపై యుద్ధం మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అదేవిదంగా రాష్ట్రంలో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకొని ప్రతిపక్షాలకు చెక్ పెట్టడం కోసమే సిఎం కేసీఆర్‌ శాసనసభలో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ప్రశాంత్ కిషోర్‌ సేవలను కేసీఆర్‌ ‘జాతీయ రాజకీయాలకు మాత్రమే’ ఉపయోగించుకొంటున్నానని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కనుక అపర చాణుక్యుడని పేరుగాంచిన సిఎం కేసీఆర్‌ అంతటివాడు వచ్చే శాసనసభ ఎన్నికలలో మళ్ళీ టిఆర్ఎస్‌ను గెలిపించుకొనేందుకు ప్రశాంత్ కిషోర్‌ వంటి ఓ రాజకీయ వ్యాపారి, దళారిని ఆశ్రయించారనే అపప్రద ఎప్పటికీ మిగిలిపోతుందని మరిచిపోకూడదు.

అలాగే రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొన్న ప్రశాంత్ కిషోర్‌ రేపు కాంగ్రెస్‌, బిజెపి లేదా మరో పార్టీతోనో చేతులు కలిపి తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఓడించేందుకు సిద్దపడినా ఆశ్చర్యపోనక్కరలేదు. కనుక ప్రశాంత్ కిషోర్‌తో దోస్తీ వ్యక్తిగతంగా సిఎం కేసీఆర్‌ ప్రతిష్టకు, రాజకీయంగా టిఆర్ఎస్‌కు దీర్గకాలంలో నష్టం కలిగించవచ్చు.


Related Post