టిఆర్ఎస్‌, బిజెపిల ఆధిపత్యపోరులో నలుగుతున్న ప్రజలు

March 21, 2022


img

తెలంగాణ ఉద్యమసమయంలో అన్ని కులమతాల ప్రజలు ఒక్కత్రాటిపై నిలిచి పోరాడారు. ఒకప్పుడు తెలంగాణలో హిందూ ముస్లిం లేదా ఆంద్రా-తెలంగాణ అని మాత్రమే వినబడేవి. కానీ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ళ తరువాత ఇప్పుడు ప్రజలందరూ కులమతాలు, పార్టీలవారీగా చీలిపోయారు. కానీ ఇందుకు వారిని నిందించలేము. ఈ పాపం అంతా అధికార ప్రతిపక్ష పార్టీలదే. 

అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌ సంక్షేమ పధకాల పేరుతో ప్రజలను రకరకాల గ్రూపులుగా విడదీసి వారందరినీ తన ఓటు బ్యాంకులుగా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకు ఉదాహరణగా రైతు సమన్వయ సమితి, దళిత బంధు వంటివి కనపడుతున్నాయి.  

టిఆర్ఎస్‌ సంక్షేమ పధకాలతో ప్రజలను తన ఓటర్లుగా మలుచుకోవాలని ప్రయత్నిస్తుంటే, బిజెపి, మజ్లీస్‌ పార్టీలు ఎప్పటిలాగే ప్రజలను హిందూ, ముస్లింలను విడదీసి పంచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం బోధన్‌ పట్టణంలో జరుగుతున్న రగడ ఇందుకు తాజా నిదర్శనం. అక్కడ ఘర్షణ పడుతున్నది తెలంగాణావాసులే కానీ రెండు పార్టీల మద్య రెండు వర్గాలుగా చీలిపోయారు.  


కులమతాలు, సంక్షేమ పధకాలతో సాగుతున్న ఈ ‘డివైడ్ అండ్ రూల్’ వలన సమాజానికి తీరని నష్టం కలుగుతుంటే మరో పక్క అధికారంలో ఉన్న పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఆచరణ సాధ్యం కాని హామీలను, పధకాలను ప్రకటిస్తుండటం వలన రాష్ట్రం మెల్లగా అప్పులలో కూరుకుపోతోంది. 

ఉదాహరణకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించలేకపోతున్న ప్రభుత్వం, ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు ఏవిదంగా చెల్లించగలదు?ఇంతవరకు పంటరుణాలనే పూర్తిగా మాఫీ చేయలేకపోతున్న ప్రభుత్వం 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఎప్పటికి ఇవ్వగలదు?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కొరకే ఇటువంటి గొప్ప గొప్ప పధకాలు చేపడుతున్నామని చెప్పుకొన్న నోటితోనే ఆ పధకాలతో రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం తప్పేమీ కాదని టిఆర్ఎస్‌ వాదిస్తోంది. అంటే రాజకీయ లబ్ది కోసమే పధకాలు ప్రకటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, మళ్ళీ ఆ భారాన్ని ప్రజల నెత్తిమీదే వేయడం ఏవిదంగా సమర్ధించుకోగలదు?

నిజానికి టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఈ 8 ఏళ్ళలో చేసిన, ఇకపై చేయబోయే అభివృద్ధి పనుల గురించి, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన గురించి గట్టిగా చెప్పుకోగలిగితే చాలు. కానీ నానాటికీ రాష్ట్రంలో బిజెపి బలపడుతుండటంతో టిఆర్ఎస్‌ కూడా ఇటువంటి పధకాలను వ్యూహాలుగా అమలుచేస్తోందని భావించవచ్చు. 


Related Post