ఈ కుర్రాడు ప్రతీరోజూ రాత్రి పరిగెడుతుంటాడు..ఎందుకో తెలుసా?

March 21, 2022


img

అతని వయసు 19. పేరు ప్రదీప్ మెహ్రా. ప్రతీరోజు రాత్రి 11 గంటలకు ఢిల్లీకి సమీపంలో గల నొయిడా నుంచి భుజానికి ఓ బ్యాగ్ తగిలించుకొని పరుగెత్తుతుంటాడు. నిన్న రాత్రి కూడా అలాగే రోడ్డుపై ఒంటరిగా పరిగెడుతున్నాడు. అటుగా వెళుతున్న బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి అతనిని చూసి ఏదో ఇబ్బందిలో చిక్కుకొని పరిగెడుతున్నాడని సహాయం చేయాలని భావించి కారులో లిఫ్ట్ ఇస్తానన్నాడు. కానీ ఆ యువకుడు వద్దన్నాడు. అది విని వినోద్ ఆశ్చర్యపోయాడు. 

అతను అలా పరిగెడుతుంటే పక్కనే కారుతో అతనిని ఫాలో అవుతూ తన మొబైల్ ఫోన్‌లో అతనిని షూట్ చేస్తూ వివరాలు కనుకొన్నాడు. ఆ 19 ఏళ్ళ యువకుడు ప్రదీప్ చెప్పింది వింటే మనమూ ఆశ్చర్యపోతాము. 

ఇంతకీ అతను ఏమి చెప్పాడంటే, “నేను, నా సోదరుడు ఉత్తరాఖండ్ నుంచి నోయిడాకు వచ్చి ఉద్యోగాలు చేసుకొంటున్నాము. నేను ఇక్కడ మెక్‌డొనాల్డ్ లో పనిచేస్తుంటాను. ఎప్పటికైనా ఆర్మీలో చేరాలని నా కోరిక. అందుకే రోజూ డ్యూటీ అయిపోగానే 10 కిమీ దూరంలో ఉన్న రూమ్‌కి ఇలా పరిగెత్తుకొంటూ వెళ్తూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఉదయం వంట చేసుకొని డ్యూటీకి బయలుదేరాలి కనుక తెల్లవారుజామున లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేందుకు సమయం సరిపోదు. అందుకే ఇలా ప్రతీరోజు రాత్రి డ్యూటీ అయిపోయిన తరువాత రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను,” అని ప్రదీప్ చెప్పాడు.

అప్పుడు దర్శకుడు వినోద్ కాప్రి “పోనీ ఈ ఒక్కరోజుకీ నా కారెక్కు. ఇద్దరం మా ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తరువాత నిన్ను మీ రూమ్‌ దగ్గర దింపేస్తాను,” అని అడిగితే ఆ యువకుడు చెప్పిన సమాధానం ఇంకా అబ్బురపరుస్తుంది. “ఒక్కరోజు ప్రాక్టీస్ మానేసినా మళ్ళీ చేయడం కష్టమనిపిస్తుంది. నన్ను రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోనివ్వండి. నేను రూమ్‌కి చేరుకొన్నాక నా సోదరుడు డ్యూటీ ముగించుకొని వస్తాడు. ఒకవేళ నేను మీతో భోజనం చేస్తే అతను ఆకలితో పడుకోవలసి వస్తుంది. కనుక నేను రూమ్‌కి వెళ్ళి వంట చేసుకోవాలి,” అని సమాధానం చెప్పడంతో దర్శకుడు వినోద్ కాప్రి ఆ యువకుడి పట్టుదలకి ఫిధా అయిపోయాడు. 

అప్పుడు మళ్ళీ, “నేను ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతుంది తెలుసా?” అని కవ్విస్తాడు. దానికి ఆ యువకుడు చెప్పిన సమాధానం వింటే మనమూ ఫిధా అయిపోవలసిందే. “పెడితే పెట్టండి. నేనొక అనామకుడిని. నన్ను ఎవరు గుర్తు పడతారు?అయినా నేనేమీ తప్పు పనిచేయడం లేదు కదా?” అని ప్రశ్నించాడు. 

కేవలం 19 ఏళ్ళ వయసులో ఆ యువకుడు ప్రతీరోజూ ఇంతగా కష్టపడుతున్నప్పటికీ అందుకు ఏమాత్రం బాధపడకుండా తన లక్ష్య సాధన కోసం ఇంత పట్టుదలగా కృషి చేస్తుండటం, ఇంత చిన్న వయసులోనే ఇంత బాధ్యతగా వ్యవహరిస్తుండటం చాలా చాలా గొప్ప విషయం. ఈ అనామకుడైన ప్రదీప్‌ని చూసి నేటి యువత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంత పట్టుదలతో కృషి చేస్తున్న ప్రదీప్‌కు తప్పకుండా ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. అంతేకాదు ఏదో ఓ నాడు దేశానికే గర్వకారణమయినా ఆశ్చర్యపోనక్కరలేదు. శభాష్...రన్ ప్రదీప్ రన్! 



Related Post