ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌లో కుమ్ములాటలే

March 21, 2022


img

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీలో సీనియర్ నేతలు జీ-23 పేరుతో సమావేశాలు పెట్టుకొని సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు పక్కకు తప్పుకొని పార్టీ పగ్గాలు ఇతరులకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో అసమ్మతి సెగలతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు అధ్యక్షతన జగ్గారెడ్డి వంటి పలువురు నేతలు హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. వారికి పోటీగా రేవంత్‌ రెడ్డి కూడా నిన్న గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి అసమ్మతినేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌ పార్టీలో అందరూ కుమ్ములాడుకొంటూ పార్టీ పరువు తీసుకొంటున్నారు. 

అసమ్మతి నేతల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పంజాబ్‌లోలాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టపోకుండా పార్టీని కాపాడుకొనేందుకే మేము సమావేశమయ్యి చర్చిస్తున్నాము తప్ప పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి పార్టీలో తను తప్ప మరెవరూ లేరన్నట్లు వన్ మ్యాన్ షో చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. పోనీ మా అధిష్టానానికి చెప్పుకొందామంటే మాకు అపాయింట్మెంట్ లభించదు. ఈ పరిస్థితులలో ఏమి చేయాలో పాలుపోక రాష్ట్రంలో పార్టీని ఏవిదంగా కాపాడుకోవాలా అని చర్చించుకొనేందుకు సమావేశమవుతున్నాము. ఒకవేళ నన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తే నేను వేరే ఏ పార్టీలో చేరాను. ఇండిపెండెంట్‌గానే ఉండిపోతాను. నాపై కోవర్ట్ అనే ముద్రవేసి సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నవారికి తగిన సమయంలో తగినవిదంగా బుద్ధి చెపుతాను,” అని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

ఈ అసమ్మతి నేతల సమావేశానికి మాజీ మంత్రి గీతారెడ్డి, జీవన్ రెడ్డి, అద్దంకి దయాకర్, శ్రీధర్ బాబు, బెల్లయ్య నాయక్, మానవతారాయ్ తదితరులు హాజరయ్యారు.


Related Post