కేంద్రంపై మళ్ళీ దండయాత్రకు సిఎం కేసీఆర్‌ సన్నాహాలు

March 19, 2022


img

సిఎం కేసీఆర్‌ శనివారం ఎర్రవెల్లిలో తన ఫామ్‌హౌస్‌లో  మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వేసవిలో రాష్ట్రంలో పండే ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై మళ్ళీ ఒత్తిడి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ఈ సమస్యపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీసీబి, డీసీఎంఎస్ అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకావాలని పార్టీ తరపున అందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు సమస్యపై సమావేశంలో లోతుగా చర్చించిన తరువాత అదేరోజు సాయంత్రం సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఉన్నతాధికారుల బృందం ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులను కలవాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ లభిస్తే ఆయనను కూడా కలిసి వేసవిలో పండే ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కోరనున్నారు. 

ఒకవేళ కేంద్రప్రభుత్వం నిరాకరిస్తే రాష్ట్రంలో భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిఆర్ఎస్‌ నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. బహుశః ఈ భవిష్య కార్యాచరణకు అందరినీ సిద్దం చేసేందుకే 21న జరుగబోయే సమావేశానికి జిల్లా స్థాయి నేతలను కూడా హాజరుకావాలని ఆదేశించించి ఉండవచ్చు. 

అయితే ఈ యాసంగిలో పండే ధాన్యం కొనుగోలు చేయబోమని కనుక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కేంద్రప్రభుత్వం గత సీజనులోనే చెప్పింది. ఈ విషయం తెలిసీ సిఎం కేసీఆర్‌ ఢిల్లీకి బయలుదేరుతున్నారంటే యుద్ధభేరీ మ్రోగించడానికే అని భావించవచ్చు. కనుక త్వరలోనే రాష్ట్రంలో మళ్ళీ టిఆర్ఎస్‌-బిజెపిల రాజకీయ యుద్ధం ప్రారంభం మొదలవుతుంది. ఈసారి వాటి మద్య యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో...దానిలో చివరికి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో రాబోయే రోజుల్లో చూడవచ్చు. 


Related Post