కేసీఆర్‌తో గ్యాప్ లేదు..ఉంటే ఇబ్బంది లేదు: జీయర్ స్వామి

March 19, 2022


img

సర్వసంఘ పరిత్యాగులుగా జీవించాల్సిన సాధువులు, స్వామీజీలు రాజకీయ నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతుండటం పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా అధికార పార్టీల ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయిలో అయితే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులతో రాసుకుపూసుకు తిరుగుతుంటారు. వారిని తమ ఆశ్రమాలకు రప్పించుకొని తమ పలుకుబడిని ప్రదర్శిస్తుంటారు. వారిని మీడియా గొప్పగా హైలైట్ చేస్తుంటుంది. అన్నీ సవ్యంగా సాగినంతకాలం అందరూ వారిని ‘ఆహా ఓహో..’ అంటారు కానీ ఎప్పుడైనా బెడిసి కొడితే ‘అయ్యో పాపం..’ అనుకోకతప్పదు. ప్రస్తుతం త్రిదండి చినజీయర్ స్వామి వారి పరిస్థితి ఇదేననిపిస్తోంది.

ఇంతకాలం ఆయన యాదాద్రి పునర్నిర్మాణం, ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలలో సిఎం కేసీఆర్‌కు మార్గదర్శనం చేశారు. ముచ్చింతల్‌లో ఆయన నిర్మించిన సమతామూర్తి కేంద్రానికి ప్రధాని నరేంద్రమోడీ తరలివచ్చారు. కానీ సిఎం కేసీఆర్‌కు జీయర్ స్వామికి ఎప్పుడు, ఎక్కడ బెడిసికొట్టిందో లేదో తెలీదు కానీ ఇద్దరి మద్య దూరం పెరిగింది. బహుశః అందుకే యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు చినజీయర్ స్వామికి ఆహ్వానం రాలేదు. “ఈ దైవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే కనుక ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు,” అని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి నిన్న మీడియాతో చెప్పడం గమనిస్తే పరిస్థితి అర్ధం అవుతుంది.  

జీయర్ స్వామి నిన్న విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు ‘సిఎం కేసీఆర్‌తో గ్యాప్ పెరగడంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “మాకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు. కానీ వాళ్ళు గ్యాప్స్ పెట్టుకొంటే మేమేమీ చేయలేం. యాదాద్రిలో జరుగుతున్న కార్యక్రమాలకు ఆహ్వానిస్తే వెళతాము లేకుంటే చూసి ఆనందిస్తాము. మేము సమాజానికి కళ్ళ వంటి వాళ్ళం. కనుక మీరు నడిచే దారిలో రాళ్ళే ఉన్నాయో...ముళ్ళే ఉన్నాయో మేము చూసి చెపుతుంటాము. ఎందుకంటే కాలికి ముల్లు గుచ్చుకొంటే కళ్ళే కన్నీళ్లు కార్చుతాయి కదా అందుకు. మేము ఎవరితో రాసుకు పూసుకు తిరగము. ఒకవేళ ఎవరైనా వచ్చి ఏదైనా సలహా అడిగితే చెపుతాము,” అని అన్నారు. 


Related Post