బండికి కేటీఆర్‌ సవాల్...స్వీకరించగలరా?

March 18, 2022


img

కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో మానేర్ రివర్ ఫ్రంట్‌తో సహా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్ కలిసి గురువారం శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “మా గంగుల కమలాకర్‌పై ఓడిపోయి ఇంట్లో కూర్చోన్న బండి సంజయ్‌ తంతే బూరెల గంపలో పడినట్లు లోక్‌సభ ఎన్నికలలో గెలిచినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైపోయారు. అప్పటి నుంచి ఒకటే వాగుడు, నీలుగుడు. ఆయన నోటికి అడ్డే లేకుండా పోతోంది. రోజూ పంచ్ డైలాగులు బాగానే చెపుతున్నావు కానీ నీకు దమ్ముంటే వచ్చే ఎన్నికలలో కరీంనగర్‌ నుంచి మా గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలిచి చూపించు. మూడేళ్ళుగా కరీంనగర్‌ ఎంపీగా ఉన్నావు. ఈ మూడేళ్ళలో కేంద్రం నుంచి జిల్లాకు కనీసం మూడు కోట్లు తీసుకురాగలిగావా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని గట్టిగా అడిగేరా?కనీసం జిల్లాకు ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ అయినా మంజూరు చేయించగలిగాడా? ఏమీ లేదు. డబ్బాలో రాళ్ళు పోసి గలగలలాడించి చప్పుడు చేసినట్లు తెల్లారి లేస్తే ఎంతసేపు మా ప్రభుత్వంపై అరుస్తుండటం లేదా ప్రజల మద్య మతచిచ్చు రగిలిస్తుండటం...ఇదే కదా నువ్వు చేయగలిగే పనూలు?” అని మంత్రి కేటీఆర్‌ ఘాటుగా బండి సంజయ్‌ను విమర్శించారు. 

వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పదేపదే చెపుతున్న బండి సంజయ్‌ కేటీఆర్‌ విసిరిన ఈ సవాలును స్వీకరించిగలరా?లేకుంటే తెలంగాణలో బిజెపిని ఏవిదంగా అధికారంలోకి తీసుకురాగలరు? 


Related Post