ఆమాద్మీ తదుపరి లక్ష్యం తెలంగాణ?

March 18, 2022


img

ఇంతకాలం ఢిల్లీకే పరిమితమైయున్న ఆమాద్మీ పార్టీ తొలిసారిగా పంజాబ్‌లో కూడా అధికారంలోకి రావడంతో ఆ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఏడాది చివరిలోగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రెండు రాష్ట్రాలలో కూడా పోటీ చేయబోతున్నట్లు ఆమాద్మీ ఇప్పటికే ప్రకటించింది. వాటి తరువాత దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలమైన రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నట్లు ఆ పార్టీ గుర్తించింది. కనుక ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టాలని నిశ్చయించుకొంది. ఆమాద్మీ తెలంగాణ ఇన్‌-ఛార్జ్ గా ఆ పార్టీ సీనియర్ నేత సోమనాథ్ భారతిని నియమించింది. త్వరలోనే ఆయన హైదరాబాద్‌ వచ్చి రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, మేధావులు, యువతతో రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం. వచ్చే నెల 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఆమాద్మీ నేతలు 119 నియోజకవర్గాలలో పాదయాత్రలతో ప్రజల మద్యకు వెళ్ళబోతున్నారు. ఆమాద్మీ అధినేత, ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే హైదరాబాద్‌ రానున్నట్లు సమాచారం. 

ఆమాద్మీ పార్టీ కాంగ్రెస్‌, బిజెపిలతో సమాన దూరం పాటిస్తోంది కనుక సిఎం కేసీఆర్‌ ఆ పార్టీని కూడా తన జాతీయ ఫ్రంట్‌లో కలుపుకోవాలనుకొన్నారు. కానీ ఇప్పుడు అదే ఆమాద్మీ పార్టీ టిఆర్ఎస్‌ను ఢీకొని ఓడించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకొంటోంది. ఇది సిఎం కేసీఆర్‌కు పెద్ద షాక్ వంటిదే. దీనిపై టిఆర్ఎస్‌ ఏవిదంగా స్పందిస్తుదో చూడాలి.  


Related Post