ఏపీ ప్రభుత్వం గుప్పెట్లో తెలుగు సినీ పరిశ్రమ

March 17, 2022


img

ఏపీలో పెద్ద సినిమాలు విడుదల చేయాలంటే వాటి దర్శకనిర్మాతలకు చమట్లు పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం సినీ నియంత్రణ చట్టం తెచ్చి దాంతో నిబందనల పేరిట థియేటర్లపై ఉక్కుపాదం మోపుతుండటం, టికెట్ ధరలను తగ్గించడం, బెనిఫిట్ షోలకు అనుమతులు నిరాకరిస్తుండటం వంటివి వందల కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా సినిమా బాగోకపోతే ఎలాగూ నష్టపోక తప్పదు. మరోపక్క ఈ నిబందనలు, ఆంక్షలతో సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి. దీంతో సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఏపీ ప్రభుత్వం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. 

రూ.400 కోట్లు పెట్టుబడితో ఆర్ఆర్ఆర్ దర్శక నిర్మాతలు రాజమౌళి, డీవీవీ దానయ్యలదీ ఇదే పరిస్థితి. వారిరువురూ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి త్వరలో విడుదలకాబోతున్న తమ ఆర్ఆర్ఆర్‌ సినిమాకు మొదటి పది రోజులు టికెట్ ధర పెంచుకొనేందుకు అనుమతించాలని కోరారు. 

ఈ మేరకు వారు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారని దానిలో వారు తమ సినిమాకు జీఎస్టీ, నటీనటులు, దర్శకుడి పారితోషికాలు కాకుండా రూ.336 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారని, కనుక తాజా జీవో 13 ప్రకారం టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతికోరారని ఏపీ ఫిలిమోటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చెప్పారు. సంబందిత అధికారులు ఆర్ఆర్ఆర్ సినిమా బడ్జెట్‌ వివరాలను పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తారని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకొంటారని తెలిపారు. ప్రజలపాయి భారం పడకుండా ఉండేవిదంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని మంత్రి పేర్ని నాని చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమ ఏపీ ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకొందని దీంతో అర్ధం అవుతోంది. కనుక వందల కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి సినిమా తీసిన దర్శక నిర్మాతలు ఏపీలో వాటిని రిలీజ్ చేసుకోవాలంటే ఏపీ ప్రభుత్వం ముందు చేతులు చాచి ఈవిదంగా అర్ధించక తప్పదు. ఈ కష్టాలు, వేడికోవడాలు వద్దనుకొంటే ఇక ఏపీలో తమ సినిమాలు రిలీజ్ చేయడం మానుకోవలసి ఉంటుంది.


Related Post