ప్రశాంత్ కిషోర్‌-విజయ్ భేటీ... దేనికో?

March 17, 2022


img

తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా తనకంటే ఎక్కువమంది అభిమానులున్న కమల్ హాసన్‌ రాజకీయాలలో ఎదురుదెబ్బలు తింటూ నిలద్రొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతుండటం చూసి ఇంతకాలం విజయ్ ఇటువంటి ఆలోచనలను దూరం పెట్టారు. కానీ అన్నాడీఎంకె పార్టీ బలహీనపడటం, కమల్ హాసన్‌ ప్రయత్నాలు విఫలమవడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని విజయ్, ఆయన తండ్రి చంద్రశేఖర్ ఇద్దరూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విజయ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్ళి అక్కడ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో రహస్యంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. 

రాష్ట్రంలో అన్నాడీఎంకె పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం కేంద్రప్రభుత్వం, బిజెపి కనుసన్నలలో నడుచుకొంటుండటంతో పార్టీ శ్రేణుల్లో నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా విజయ్ బృందం గుర్తించింది. అదీగాక శాసనసభ ఎన్నికలకి ఇంకా రెండేళ్ళు సమయం ఉంది. కనుక ఇప్పుడు పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినట్లయితే అన్నాడీఎంకె పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ తమవైపు వస్తుందని, అప్పుడు తమిళనాడు డీఎంకె, అన్నాడీఎంకె పార్టీలకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగవచ్చని విజయ్, ఆయన తండ్రి చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ ధైర్యం చేసి పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తారా లేక రజనీకాంత్‌లాగ ఒట్టినే హడావుడి చేస్తూ తన సినిమాలకు ప్రమోషన్‌గా వాడుకొంటారా? అనేది మున్ముందు తెలుస్తుంది.


Related Post