ఎన్నికలలో ఓడిపోతే అదే పరిష్కారం

March 16, 2022


img

దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం 2014 నుంచి మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వెంటనే ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులను పదవిలో నుంచి తప్పుకోవలసిందిగా ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోయినా దానికి ఏకైక పరిష్కారం ఇదేనని భావిస్తుంటుంది కనుక ఇప్పుడూ ఇదే చేస్తోంది. తద్వారా సోనియా గాంధీ చాలా చురుకుగా కటినమైన నిర్ణయాలు తీసుకొన్నారని కాంగ్రెస్‌ పార్టీలో వారి బాకారాయుళ్ళు గొప్పగా చెప్పుకొంటున్నారు. 

ఈ ఎన్నికలలో పార్టీని గెలిపించలేకపోయిన సోనియా, రాహుల్, ప్రియాంకాలు మాత్రం నైతిక బాధ్యత వహించడంలేదు. బాధ్యత వహించి కాంగ్రెస్‌ పగ్గాలు వేరేవారికి అప్పగించి పదవులలో నుంచి తప్పుకోవాలని పార్టీలో సీనియర్ నేతలు వారి మొహం మీదే చెపుతున్నా అందుకు వారు ఇష్టపడటం లేదు. పైగా ‘బిజెపిలో టికెట్స్ ఖాయం అయితే వెళ్లిపోండి..’ అంటూ తమ బాకారాయుళ్ళ చేత వారిపై ఎదురుదాడి చేయిస్తున్నారు. అంటే కాంగ్రెస్ అనే టైటానిక్ షిప్ పూర్తిగా మునిగిపోయినా పర్వాలేదు కానీ చివరి వరకు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉండాలని వారు ముగ్గురూ కోరుకొంటున్నట్లుంది. అసలు షిప్పే లేకుండాపోతే స్టీరింగ్‌ ఎందుకు అని మాత్రం ఆలోచించడం లేదు. 

ఈ పరిస్థితులలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలన తమకు భయం లేదని బిజెపి నేతలు చాలా సంతోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని తాము ఎదుర్కోనవసరంలేదని, దానిని వారి చేతులతో వారే స్వయంగా ముంచుకొంటారని చెపుతున్న బిజెపి నేతల మాటలను కొట్టిపారేయలేము. 


Related Post