బిజెపి కొంప ముంచనున్న డబుల్ ఇంజన్ గ్రోత్ నినాదం

March 16, 2022


img

కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నట్లయితే కేంద్రం సహకారంతో రాష్ట్రాలు జోరుగా అభివృద్ధి సాధించగలవు. దీనికి బిజెపి ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ అని పేరు పెట్టింది. తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బిజెపి ఇప్పుడు ఈ ఫార్ములా గురించే గట్టిగా మాట్లాడుతోంది. బిజెపి తెర పైకి తెచ్చిన ఈ సరికొత్త వాదనకు సిఎం కేసీఆర్‌ నిన్న శాసనసభలో ఘాటుగా సమాధానం చెప్పారు. బిజెపి పాలిత యూపీలో జరిగిన అభివృద్ధి, జీడీపీ, మాతా శిశుమరణాల రేటులను తెలంగాణతో పోల్చి గణాంకాలతో సహా వివరించి, బిజెపి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతోందని తేల్చి చెప్పారు. ప్రజల మద్య మత చిచ్చు రగిలించి దేశాన్ని బిజెపి భ్రష్టు పట్టిస్తోందని కనుక బిజెపి పాలన అంటే డబుల్ ఇంజన్ కాదు..ట్రబుల్ ఇంజన్ అని సిఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేకపోయినా రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంటే బిజెపి చెపుతున్న ఈ ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ ఫార్ములా అర్ధరహితమని స్పష్టం అవుతోంది. అన్ని రంగాలలో వెనుకబడిన రాష్ట్రాలలో ఈ నినాదంతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకోవచ్చు కానీ తెలంగాణలో మాత్రం సాధ్యం కాదని గ్రహిస్తే మంచిది.

రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపడం లేదని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని విదాలుగా సహకరిస్తున్నామని బిజెపి నేతలు, కేంద్రమంత్రులు పదేపదే చెపుతుంటారు. కానీ రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలోనే ఉంటేనే అభివృద్ధి సాధిస్తుందని చెపుతున్నారు. అంటే తమ పార్టీ అధికారంలోలేని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం సహకరించదని, ఈ విషయంలో టిఆర్ఎస్‌ వాదనలు నిజమేనని బిజెపి నేతలు స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది.


Related Post