సింగరేణి గనుల వేలం.. పరిష్కారమే లేదా?

March 15, 2022


img

సింగరేణిలో సమ్మె సైరన్ మ్రోగింది. కేంద్రప్రభుత్వం సింగరేణిలో జేబిఆర్ఓసి-3, శ్రావన్ పల్లి ఓసి, కోయగూడెం ఓసి-3 మరియు కెకె -6 యుజి బ్లాక్ నాలుగు బొగ్గు గనులను వేలంవేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఈనెల 28,29 తేదీలలో రెండు రోజులు సమ్మె చేయబోతున్నాయి. టిఆర్ఎస్‌ అనుబంద సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా అన్ని కార్మిక సంఘాలు ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. 

బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కనుక సిఎం కేసీఆర్‌ కూడా అభ్యంతరం చెపుతూ గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ వ్రాశారు. కార్మిక సంఘాలు కూడా నిరసనలు తెలిపాయి. కానీ కేంద్రప్రభుత్వం స్పందించలేదు. కనుక ఇప్పుడు కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాల ఒత్తిడికి కేంద్రప్రభుత్వం తలొగ్గి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంటుందా? అంటే అనుమానమే. ఒకవేళ అవసరమైతే సింగరేణిలో కేంద్రప్రభుత్వ వాటాలను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి సింగరేణిని కాపాడుకొనేందుకు సిద్దంగా ఉందని సిఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రప్రభుత్వం కూడా వరుసపెట్టి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఒకటొకటిగా వదిలించుకొంటోంది. కనుక గనుల వేలంను అడ్డుకొనేందుకు సింగరేణిలో కేంద్రప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి సొంతం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది.


Related Post