సిఎం కేసీఆర్‌ అందుకే ఓవైసీని యూపీకి పంపారు: రేవంత్‌

March 14, 2022


img

యూపీ ఎన్నికలలో బిజెపి మళ్ళీ ఘనవిజయం సాధించడం, ఈసారి తప్పకుండా గెలుస్తుందనుకొన్న సమాజ్‌వాదీ పార్టీ ఓడిపోవడం, మజ్లీస్‌ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోవడంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో విశ్లేషించారు. 

ఆయన మొన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “యూపీలో బిజెపి తనంతట తాను గెలవలేదు. సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీ కలిసి గెలిపించారు. ‘బిజెపిని దేశం నుంచి తరిమేస్తాం...’ అని చెపుతున్న సిఎం కేసీఆర్‌కు యూపీ ఎన్నికలలో నిజంగానే బిజెపిని ఓడించాలనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే తన ఆప్తమిత్రుడు అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడి యూపీ ఎన్నికలలో మజ్లీస్‌ పోటీ చేసినట్లయితే ముస్లిం ఓట్లు చీలి సమాజ్‌వాదీ పార్టీ నష్టపోతుందని చెప్పి ఆపి ఉండేవారు. కానీ ఆపలేదు! ఎందుకంటే వారిద్దరి లక్ష్యం బిజెపిని గెలిపించడమే. 

యూపీ ఎన్నికలలో అసదుద్దీన్ ఓవైసీ బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ, యూపీ సిఎం యోగీ ఆధిత్యనాధ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించడం ద్వారా హిందూ ఓటర్లందరూ ఏకమైయ్యేలా చేసి ఆ ఓట్లన్నీ గంపగుత్తగా బిజెపికి పడేలా చేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి పడవలసిన ముస్లిం ఓట్లన్నీ సమాజ్‌వాదీ పార్టీకి బదిలీ కావలసి ఉండగా వాటన్నిటినీ మజ్లీస్‌ పార్టీతో చీల్చి ఆ పార్టీ గెలవకుండా సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీలు అడ్డుపడ్డారు. 

సాధారణంగా ఎవరైనా ఎవరికైనా ఓ పని అప్పజెపితే, అది పూర్తిచేసిన తరువాత ఆ వ్యక్తి వెళ్ళి తనకు ఆ పని అప్పగించిన వ్యక్తిని కలిసి ఆ విషయం తెలియజేసి మెప్పు పొందడం సహజం. అసదుద్దీన్ ఓవైసీ కూడా యూపీలో సమాజ్‌వాదీ పార్టీని దెబ్బ తీసి బిజెపిని గెలిపించిన తరువాత వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి ‘యూపీ ఆపరేషన్ సక్సస్’ అని తెలియజేసి ఇద్దరూ షేక్‌ హ్యాండ్ ఇచ్చుకొన్నారు. ఇదంతా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల డైరెక్షన్‌లోనే విజయవంతంగా పూర్తయింది. మోడీ-కేసీఆర్‌-ఓవైసీల రహస్య అవగాహన గురించి తెలియనివారే యూపీలో బిజెపి తనంతట తానే ఘనవిజయం సాధించిందని చెపుతుంటారు,” అని అన్నారు.


Related Post