తెలంగాణకు ధీటుగా ఏపీ బడ్జెట్‌

March 11, 2022


img

తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు వంటి హైదరాబాద్‌ నుంచి భారీగా ఆదాయం సమకూరుతుంటుంది. అలాగే ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో శరవేగంగా ఐ‌టి, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి సాధించాయి. ఆ కారణంగా జీడీపీ వృద్ధిరేటు కూడా చాలా గొప్పగా ఉంది. కనుక రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, దానిలో దళిత బంధు వంటి పధకాలకు రూ.17,700 కోట్లు నిధులు కేటాయించడం కష్టమేమీ కాదు. 

కానీ ఏపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, నిర్ణయాల వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అయినప్పటికీ ధనిక రాష్ట్రమైన తెలంగాణతో పోటీ పడుతున్నట్లు ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ్ళ రూ.2,56,256 కోట్ల బడ్జెట్‌ను ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టడం విశేషం. దానిలో అధికభాగం సంక్షేమ పధకాలకే కేటాయించడం మరో విశేషం.        

బుగ్గన బడ్జెట్‌ ప్రకారం...ఏపీ రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు; మూలధన వ్యయం రూ.47,996 కోట్లు; రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు; ద్రవ్యలోటు రూ.48,724 కోట్లు ఉంది. 

రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో సంక్షేమ పధకాలకే రూ.49,799 కోట్లు కేటాయించారు. ఇవికాక తప్పనిసరిగా కేటాయించవలసిన సోషల్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమం, బీసీ సంక్షేమం, ఈబీసీల సంక్షేమం, ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ వంటివాటికీ రూ.1.01 లక్షలు కేటాయించారు. 

తెలంగాణ ప్రభుత్వంలాగా సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచి పెడితే అందరూ హర్షిస్తారు కానీ ఆదాయం లేకుండా అప్పులు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తుండటమే విమర్శలకు తావిస్తోంది. 


Related Post