యూపీలో మజ్లీస్ ఓటమిపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

March 11, 2022


img

మజ్లీస్ పార్టీ యూపీ శాసనసభ ఎన్నికలలో 100 సీట్లకు పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోగా 99 మంది అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. దేశంలో ముస్లింలకు మజ్లీస్ పార్టీ తానే ప్రాతినిధ్యం వహిస్తోందని భావిస్తుంటుంది. కానీ యూపీలో ముస్లిం ఓటర్లు మజ్లీస్ పార్టీని గుర్తించనేలేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి యూపీలో బిజెపికి ఎదురుగాలులు వీస్తున్నందున మజ్లీస్‌కు మంచి ఫలితాలు వస్తాయని అసదుద్దీన్ ఓవైసీ ఆశిస్తే అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు దక్కకపోవడం పెద్ద షాక్. 

ఈ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “దేశంలో ఎప్పటి నుంచో 80:20 ప్రాతిపదికన రాజకీయాలు, ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడూ అదే జరిగింది. చివరికి లఖింపూర్‌లో కూడా బిజెపియే గెలవడం చాలా ఆశ్చర్యపరిచింది. యూపీలో బిజెపి గెలిచింది కనుక అదిప్పుడు ఎన్నయినా చెప్పగలదు. ఇప్పుడు మేము ఏమి మాట్లాడినా ప్రయోజనం లేదు. ఏది ఏమైనప్పటికీ యూపీ ప్రజలు తమ తీర్పు ఇచ్చారు కనుక దానిని మేము గౌరవిస్తాము. ఈ ఓటమితో క్రుంగిపోము. మళ్ళీ తదుపరి పోరాటాలకు సిద్దం అవుతాము. ఈ ఎన్నికలు దేశంలో ముస్లిం పాలిటిక్స్‌కి ఓ మలుపుగా భావిస్తున్నాము,” అని అన్నారు.          

అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన 80:20 అంటే హిందూ, ముస్లింల జనాభా ప్రాతిపదికన అని అందరికీ తెలుసు. బిజెపి హిందుత్వ అజెండా అమలుచేస్తూ హిందువుల ఓట్లను కొల్లగొడుతోందని ఓవైసీ చెప్పకనే చెప్పారు. అయితే మజ్లీస్ కూడా మత ప్రాతిపదికనే యూపీలోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే జిల్లాలలో పోటీ చేసి ఆ 20 శాతం ముస్లిం ఓట్లను దక్కించుకోవడం కోసం ప్రయత్నించిందనే విషయం అందరికీ తెలుసు. కానీ యూపీలో ముస్లిం ఓటర్ల ఆదరణ పొందలేకపోయింది. మజ్లీస్‌ పార్టీ తమ ఓటమికి బిజెపిని నిందించడం కంటే ఓటమికి కారణాలు ఏమిటో విశ్లేషించుకొని లోపాలు సరిదిద్దుకోవడం మంచిది.  


Related Post