దేశంలో మరో ప్రధాని అభ్యర్ధి!

March 10, 2022


img

ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నవారు లేదా అందుకు తాము అన్నివిదాల అర్హులమని భావిస్తున్నవారు తెలంగాణ సిఎం కేసీఆర్‌తో సహా దేశంలో సుమారు డజను మందికి పైగా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మరో కొత్త పేరు చేరింది. ఆయనే ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్! 

ఆమాద్మీ పార్టీ పంజాబ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండటంతో ఢిల్లీ, పంజాబ్‌లలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొంటున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత రాఘవ్ చడ్డా మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ పార్టీ ఇక ఎంత మాత్రం ప్రాంతీయ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఓ జాతీయ శక్తిగా అవతరించింది. భగవంతుడి ఆశీసులతో మా అధినేత అర్వింద్ కేజ్రీవాల్ భవిష్యత్‌లో దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకొంటున్నాము,” అని అన్నారు. 

అర్వింద్ కేజ్రీవాల్ దేశానికి ప్రధాని కాగలరో లేదో కానీ ఆమాద్మీ పార్టీ దేశంలో కాంగ్రెస్‌, బిజెపిలకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఢిల్లీకి పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇప్పుడు గెలిచినట్లే భవిష్యత్‌లో ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఆమాద్మీ విస్తరించవచ్చు. అలాగే ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రమైన యూపీలో కూడా విస్తరించవచ్చు. ఆ తరువాత రాజస్థాన్, జమ్ముకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరించవచ్చు. ఆమాద్మీ పార్టీ ప్రభావమేలేని గోవాలో పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకోగలిగినప్పుడు భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలకు విస్తరించడం అసాధ్యమేమి కాదు. అదే కనుక జరిగితే అప్పుడు కాంగ్రెస్‌, బిజెపిలకు ఆమాద్మీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయితే దీనికి ఎంతకాలం పడుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. 


Related Post