ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల విమర్శలు..ఎవరికి మేలు?

March 10, 2022


img

ఇంతకాలం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌, బిజెపిలు ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు చేశాయి. తీరా ఇప్పుడు సిఎం కేసీఆర్‌ ఒకేసారి 80,090 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వబోతునట్లు ప్రకటించగానే, దానినీ తప్పు పడుతున్నాయి. 

కాంగ్రెస్‌ నేతలు నిరుద్యోగ భృతి, మరో లక్ష ఉద్యోగాలు ఏమైయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు ఎన్నికల కోసమే సిఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారని వాదిస్తున్నారు. ఇక బిజెపి నేతలు మా పోరాటాల వలననే సిఎం కేసీఆర్‌ దిగివచ్చి ప్రకటన చేశారని ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కేసీఆర్‌ను విడిచిపెట్టేదేలేదంటున్నారు.  

అయితే చాలా ఏళ్ళు ఆలస్యమైనా ఒకేసారి ఏకంగా 80,090 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడబోతుండటంతో విద్యార్దులు, నిరుద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. తమ కష్టాలన్నీ తీరిపోయాయని సంబురాలు చేసుకొంటున్నారు. సిఎం కేసీఆర్‌ ఒక్క ప్రకటనతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బహుశః కాంగ్రెస్‌, బిజెపిలకు కూడా ఈవిషయం తెలిసే ఉంటుంది. కానీ చేసేదేమీ లేక ఏదో సాకుతో సిఎం కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ఆ పార్టీలకు ఎంతో కొంత నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరుగదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇది ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లయితే, సిఎం కేసీఆర్‌ దీనిని ఎన్నికల వరకు సాగదీసే అవకాశం ఉంది. అప్పుడు దీంతో టిఆర్ఎస్‌ ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. అదే..ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి ఎంపికైన వారందరికీ నిజంగానే ఉద్యోగాలు కల్పించి తన చిత్తశుద్ధి నిరూపించుకొన్నట్లయితే, దీని ఫలితం ఓట్ల రూపంలో టిఆర్ఎస్‌ పార్టీకే దక్కుతుంది. 

కనుక ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సిఎం కేసీఆర్‌ ఎంతవరకు పొడిగిస్తారు?ఎప్పటిలోగా ముగిస్తారు? అనే వాటిపై టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల రాజకీయ గ్రాఫ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు. 


Related Post