పంజాబ్‌లో చీపురుతో ఊడ్చేస్తున్న ఆమాద్మీ పార్టీ

March 10, 2022


img

ఆమాద్మీ ఎన్నికల గుర్తు ‘చీపురు కట్ట’. దాంతో పంజాబ్‌ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలను ఊడ్చిపడేస్తోంది. ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఓట్ల లెక్కింపులో 89 స్థానాలలో ఆమాద్మీ పార్టీ ఆధిక్యత సాధించగా, కాంగ్రెస్‌ 14, బిజెపి  కేవలం 3 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పంజాబ్‌ శాసనసభలో మొత్తం 117 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 59 సీట్లు అవసరం కానీ ఆమాద్మీ పార్టీ ఇప్పటికే 89 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అంటే పంజాబ్‌లో ఆమాద్మీ పార్టీ తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని స్పష్టమైంది.   

ఢిల్లీకే పరిమితమైన ఆమాద్మీ పార్టీ తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలలో ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉంది కానీ ఇప్పటి వరకు వేరే రాష్ట్రంలో అడుగుపెట్టలేకపోయింది. ఇప్పుడు తొలిసారిగా పంజాబ్‌లో అధికారంలోకి రాబోతోంది. ఆమాద్మీ పార్టీకి ఈ అవకాశం కల్పించింది మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానాలే అని చెప్పక తప్పదు. 

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన  రైతులు కుటుంబాలతో సహా తరలివచ్చి ఏడాదికి పైగా ఆందోళనలు చేస్తే, వారి పట్ల మోడీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించగా ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వం ఆ రైతులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తూ వారిని ప్రసన్నం చేసుకొని ఇప్పుడు పంజాబ్‌ ఎన్నికలలో లబ్ది పొందుతోంది. కనుక ఆవిదంగా ఆమాద్మీ పార్టీకి తోడ్పడినందుకు ఆ పార్టీ మోడీ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలుపుకోకతప్పదు. 

ఢిల్లీలో రైతుల ఆందోళనను ఒక గొప్ప అవకాశంగా ఆమాద్మీ పార్టీ గుర్తించింది కానీ కాంగ్రెస్‌ అధిష్టానానికి అది కనిపించకపోవడం విచిత్రం. రాహుల్ గాంధీ మొదట్లో ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు వెళ్ళి మాట్లాడారు. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడింది కూడా. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఇక వాటిపై పోరాడే అవకాశం లేకుండా చేసింది. దాంతో ఆ సమస్యను పక్కన పడేసింది. కానీ ఆమాద్మీ పార్టీ అప్పటికే ఆందోళన చేస్తున్న రైతులతో నేరుగా కనెక్ట్ అయ్యి వారి మనసులు గెలుచుకొని ఇప్పుడు ఓట్ల రూపంలో లబ్ది పొందుతోంది. కనుక రైతుల సమస్యలపై సరిగ్గా స్పందించకుండా పరోక్షంగా తోడ్పడినందుకు ఆమాద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలుపుకోకతప్పదు.


Related Post