కాంగ్రెస్‌ పని అయిపోయినట్లేనా?

March 10, 2022


img

2014 లోక్‌సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ పార్టీ తీవ్ర అప్రతిష్ట మూటగట్టుకొని బిజెపి చేతిలో ఓడిపోయింది. అప్పటి నుంచే కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైంది. ఒకప్పుడు దేశాన్ని తిరుగులేకుండా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క రాష్ట్రంలో కూడా తిరుగులేని విజయం సాధించలేని దుస్థితికి చేరుకొంది. ఇప్పుడు 5 రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితిలో ఉంది. ఒక్క గోవాలోనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని భావించగా అక్కడా బిజెపి 6 సీట్ల ఆధిక్యంలోకి వచ్చేసింది. గత 27 ఏళ్లుగా యూపీలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. ప్రియాంకా వాద్రాకు పూర్తి బాధ్యతలు అప్పగించి ఆమే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధి అంటూ మీడియాకు లీకులు ఇచ్చింది కూడా. కానీ ఆమె ఆ వార్తలను ఖండించారు. ఒకవేళ నేనే ముఖ్యమంత్రి అభ్యర్ధినని ఆమె గట్టిగా చెప్పుకొని ఉంటే కాంగ్రెస్‌కు మేలు కలిగి ఉండేదేమో? కానీ యూపీలో ఈసారి సమాజ్‌వాదీ పార్టీ గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెపుతుండటంతో, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడి ఓడిపోతే పరువుపోతుందని భయపడి ఆమె వెనక్కుతగ్గారేమో?కానీ ఈ గందరగోళం కూడా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగించి ఉండవచ్చు.      

ఇప్పటివరకు (11.25 గంటలు) యూపీలో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలలో మాత్రమే ఆధిక్యత సాధించగలిగింది. ప్రస్తుతం యూపీలో బిజెపి 268 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా సమాజ్‌వాదీ పార్టీ 119 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కనుక పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు సోనియా, రాహుల్, ప్రియాంకల నాయకత్వాన్ని మళ్ళీ ప్రశ్నించవచ్చు. యూపీలో కాంగ్రెస్‌ ఓడిపోవడం, బిజెపి భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుండటం, కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ పతనానికి దారి తీయవచ్చు.



Related Post